కాశ్మీర్లో వేడుకలపై ఆంక్షలు..బిజినెస్ కు లాస్

కాశ్మీర్లో వేడుకలపై ఆంక్షలు..బిజినెస్ కు లాస్
  •   ప్రత్యేక హోదా రద్దు తర్వాత వేడుకలపై ఆంక్షలు
  •   బంగారం, మటన్, కేటరింగ్ బిజినెస్ కు మస్తు లాస్

శ్రీనగర్: పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే చాలు.. వెడ్డింగ్ కార్డ్స్​, బ్యాండ్ బాజా, ఫంక్షన్ హాల్స్, ఈవెంట్ మేనేజర్లు, క్యాటరింగ్, బంగారం.. ఇలాంటి బిజినెస్ కు ఫుల్లు గిరాకీ వుంటుంది. కానీ కాశ్మీర్ లో పెళ్లిళ్ల సీజన్ లో వాటన్నింటికీ డిమాండ్ పడిపోయిందట. బిజినెస్ కూడా మస్తు లాస్ లో నడుస్తుందని చెప్తున్నరు. కాశ్మీర్ కు ప్రత్యేక హోదా రద్దు చేసిన తర్వాత అక్కడ విధించిన ఆంక్షల కారణంగా.. గ్రాండ్​గా చేసుకునే పెళ్లి వేడుకలు సాధారణంగానే ముగిస్తుండటంతో బంగారం, మటన్, పూల దుకాణాదారుల వ్యాపారం దెబ్బతింటోందని అంటున్నారు.

రిసెప్షన్ వేడుకలు రద్దు

ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్ లోయలో ప్రజల కదలికలపై ఆంక్షలు విధించారు. దీంతో వేలాది జంటలు ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లు, గ్రాండ్ గా పెళ్లిపందిళ్ల డెకరేషన్, రిసెప్షన్ వేడుకలను రద్దు చేసుకున్నాయి. దీంతో ఫుల్లు డిమాండ్ ఉండే మటన్ సరఫరాదారులు, క్యాటరింగ్ ఏజెన్సీలు, జ్యువెల్లరీ, వాజ్వాన్ కుక్, పెళ్లిబట్టల వ్యాపారులకు తీవ్ర నష్టం వస్తోందని చెప్తున్నారు. అప్పటికే వెడ్డింగ్ ఈవెంట్ ఏర్పాటు చేసుకున్న జంటలు వాటిని రద్దు చేసుకుంటున్నట్లు లోకల్ పత్రికల్లో ప్రకటనలిస్తున్నాయి. ఇలాంటి రద్దు ప్రకటనల కోసం పత్రికలు ఓ ప్రత్యేక పేజీని కూడా కేటాయిస్తున్నాయి. సోమవారం ఒక్కరోజే ఓ పత్రిక ఎడిషన్ లో రిసిప్షన్ వేడుకలు రద్దు చేసుకుంటున్నామంటూ 25 కు పైగా ప్రకటనలు ఉన్నాయి. మరికొన్ని న్యూస్ ఛానల్స్ కూడా ఫ్రీగా వీడియో యాడ్ ను కూడా ప్లే చేస్తున్నాయి.

దగ్గరి బంధువుల సమక్షంలోనే..

‘సాధారణంగా పెళ్లికి 10 క్వింటాళ్ల మటన్‌‌ను సరఫరా చేస్తాను. అయితే ఇప్పుడు డిమాండ్ రెండు క్వింటాళ్లకు తగ్గింది’ అని హోల్‌‌సేల్ మటన్ సరఫరాదారు చెప్తున్నారు. పెళ్లికి తప్పనిసరి అనుకునే జ్యువెల్లరీనే కొంటున్నారని దీంతో బంగారం అమ్మకాలు 50శాతం తగ్గాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెళ్లింట విద్యుత్ బల్బులతో డెకరేషన్ ఆర్డర్లు కూడా రావడంలేదని, పెళ్లి వేదికను కూడా పెద్దగా డెకరేషన్ చేయించేందుకు ముందుకురావట్లేదంటున్నారు. ఆంక్షల నేపథ్యంలో చాలా జంటలు దగ్గరి బంధువుల సమక్షంలోనే ఫంక్షన్లు జరుపుకుంటున్నారని చెప్తున్నారు.