Retail Inflation: ఏప్రిల్‌లో భారీగా తగ్గిన రిటైల్ ద్రవ్యోల్బణం.. 6 ఏళ్ల తర్వాత..

Retail Inflation: ఏప్రిల్‌లో భారీగా తగ్గిన రిటైల్ ద్రవ్యోల్బణం.. 6 ఏళ్ల తర్వాత..

April Retail Inflation: కరోనా తర్వాత భారీగా పెరిగిన ద్రవ్యోల్బణంతో భారతదేశంతో పాటు అనేక ప్రపంచ దేశాల ప్రభుత్వాలు పోరాడుతూనే ఉన్నాయి. దానిని అదుపు చేసేందుకు సదరు సెంట్రల్ బ్యాంకులు మార్కెట్లో డబ్బు లభ్యతను తగ్గించేందుకు వడ్డీ రేట్లను కూడా పెంచేసిన సంగతి తెలిసిందే.

తాజాగా భారత ప్రభుత్వం అందించిన వివరాలను పరిశీలిస్తే.. ఏప్రిల్ 2025లో దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం 3.16 శాతానికి తగ్గినట్లు వెల్లడైంది. మార్చితో పోల్చితే ఏప్రిల్ మాసంలో ద్రవ్యోల్బణం 18 బేసిస్ పాయింట్ల మేర పతనాన్ని నమోదు చేసిందని వెల్లడైంది. దీంతో 2019 జూలై తర్వాత ఏడాది ప్రాతిపధికన రిటైల్ ద్రవ్యోల్బణం కనిష్ఠాలకు దిగజారింది. 

ఇదే సమయంలో ఆహార ద్రవ్యోల్బణం ఏప్రిల్ 2025లో 1.78 శాతానికి పడిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది 1.85 శాతంగా ఉండగా.. దేశంలోని పట్టణ ప్రాంతాల్లో 1.64 శాతంగా ఉన్నట్లు డేటా వెల్లడించింది. మార్చి 2025తో పోల్చితే ఏప్రిల్ 2025లో ఆహార ద్రవ్యోల్బణం ఏకంగా 91 బేసిస్ పాయింట్లు పతనాన్ని నమోదు చేసింది. దీంతో 2021 తర్వాత తొలిసారిగా అత్యల్పాలకు ఆహార ద్రవ్యోల్బణం చేరుకుంది. 

ఇదే క్రమంలో హౌసింగ్ ద్రవ్యోల్బణం పట్టణ ప్రాంతాల్లో స్వల్పంగా తగ్గి ఏప్రిల్ 2025లో 3 శాతం వద్దకు చేరుకుంది. ఇదే సమయంలో దేశంలోని గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఫ్యూయెల్ అండ్ లైట్ ద్రవ్యోల్బణం రేటు మార్చి 2025లో 1.42 శాతం నుంచి భారీగా పెరిగి ఏప్రిల్ 2025లో 2.92 శాతానికి చేరుకున్నట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి.