మేడిగడ్డకు ఇంజినీర్లు పోలెదు.. కవిత కనిపించలేదు

మేడిగడ్డకు ఇంజినీర్లు పోలెదు.. కవిత కనిపించలేదు
  • మేడిగడ్డకు కేటీఆర్, హరీశ్ ఇతర నాయకులు
  • 70 మంది రిటైర్డ్ ఇంజినీర్లకు వెంట వెళ్లింది ఇద్దరే 
  • హరీశ్ రావు వెళ్లి బతిమాలినా రాని శ్యాంప్రసాద్ రెడ్డి
  • కేటీఆర్ స్వయంగా ఫోన్లు చేసినా నో  రెస్పాన్స్
  • భయపడుతున్న విశ్రాంత ఇంజినీర్లు

హైదరాబాద్: బీఆర్ఎస్ మేడిగడ్డ టూర్ మొదలైంది. అధికారంలో ఉన్నప్పుడు వెన్నంటి ఉన్న 70 మంది ఇంజినీర్లలో 68 మంది ఇవాళ్టి మేడిగడ్డ సందర్శనకు వెళ్లలేదు. కేవలం ఇద్దరు మాత్రమే బయల్దేరటం గమనార్హం. రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ శ్యాంప్రసాద్ రెడ్డికి కేటీఆర్ ఫోన్ చేసినా ఫలితం లేక పోయింది. మాజీ మంత్రి హరీశ్ రావు స్వయంగా వెళ్లి బతిమాలినా ఆయన మేడిగడ్డకు వెళ్లకపోవడం గమనార్హం. బీఆర్ఎస్ నేతలతో కలిసి రిటైర్డ్ ఇంజినీర్లు తన్నీరు వెంకటేశం, దామోదర్ రెడ్డి మాత్రమే వెంట వెళ్లారు. ఇంజినీర్ల సలహాలు తీసుకోకుండా అప్పటి సీఎం కేసీఆరే స్వయంగా డిజైన్ చేశారని ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. తాము అక్కడికి వెళ్లినా ఏమీ చెప్పలేని పరిస్థితి ఉంటుందనే విశ్రాంత ఇంజినీర్లు మేడిగడ్డ సందర్శనకు దూరంగా ఉన్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇదిలా ఉండగా మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, నాసిరకం పనుల నేపథ్యంలో ఇప్పటికే ఇద్దరు ఇంజినీర్లపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. తాము వెంట వెళ్లి కేసులను కొని తెచ్చుకోవడం ఎందుకనే ఉద్దేశంతోనే పలువురు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. 

కనిపించని కవిత

మేడిగడ్డ సందర్శనకు మాజీ సీఎం కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవిత వెళ్లకపోవడం చర్చనీయాంశంగా మారింది. అన్న కేటీఆర్ తో కలిసి ఆమె కూడా బస్సెక్కుతారని లీడర్లు భావించారు. కానీ ఇందుకు విరుద్ధంగా ఆమె మేడిగడ్డకు వెళ్లకపోవడం హాట్ టాపిక్ గా మారింది. వాస్తవాలు చెప్పడంతోపాలు అన్నారంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు బయల్దేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు రిటైర్డ్ ఇంజినీర్లు వెంట రాకపోవడం, అన్నకు వెన్నుదన్నుగా ఉండాల్సిన కవిత డుమ్మా కొట్టడం హాట్ టాపిక్ గా మారింది. 

టైరు పగిలింది.. అందరూ సేఫ్

బీఆర్ఎస్ నేతలు బయల్దేరిన బస్సుకు పెను ప్రమాదం తప్పింది.  జనగామ జిల్లా నెల్లుట్ల వద్ద ఆందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్​,  మీడియా ప్రతినిధులు ప్రయాణిస్తున్న బస్సు టైర్ పగిలింది. డ్రైవర్ చాక చక్యంగా బస్సును పక్కక నిలిపారు. దీంతో నేతలు, మీడియా ప్రతినిధులు కార్లతో మేడిగడ్డకు పయనమయ్యారు.