తెలంగాణలో విద్యను కావాలని ధ్వంసం చేస్తున్నారు : ఆకునూరి మురళి

తెలంగాణలో విద్యను కావాలని ధ్వంసం చేస్తున్నారు : ఆకునూరి మురళి

ఇటీవల కేంద్రం వెలువరించిన ‘పర్ఫార్మెన్స్‌ ఇండెక్స్‌ గ్రేడ్‌ (పీఐజీ)’ నివేదికపై రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి స్పందించారు. ‘సీఎం గారు ఎంత దారుణంగా మీరు తెలంగాణలో విద్యను కావాలని ధ్వంసం చేస్తున్నారు. మన ర్యాంక్ 28 రాష్ట్రాలలో కింద నుంచి 7వ ర్యాంకా..? దేశంలోని అన్ని పెద్ద రాష్ట్రాలలో మనమే చివరి ర్యాంకు. సిగ్గుపడాలి కదా..! మన ఊరు మనబడిలో రూ.7268 కోట్లు అని చెప్పి.. కనీసం గత ఏడాది రూ.300 కోట్లు కూడా ఖర్చుపెట్టలేదు’ అంటూ ట్విట్టర్ వేదికగా రాష్ర్ట ప్రభుత్వంపై మండిపడ్డారు. 

దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కలిపి చూస్తే.. పాఠశాల విద్య నాణ్యతలో తెలంగాణ 31వ స్థానంలో ఉన్నట్టు పీఐజీ నివేదిక పేర్కొంది. గత ఏడాదికన్నా ఐదు పాయింట్లు తగ్గిపోయి దిగువ నుంచి ఏడో స్థానంలో నిలిచినట్టు తెలిపింది. వేలకొద్దీ స్కూళ్లలో ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయని, బోధనతోపాటు పర్యవేక్షణ కూడా సరిగా లేదని వెల్లడించింది. 

పాఠశాలల్లో అభ్యసన ఫలితాలు, మౌలిక వసతులు, ప్రభుత్వ పాలన (గవర్నెన్స్‌), విద్యార్థుల నమోదు వంటి అంశాల ఆధారంగా ఏటా ‘పీఐజీ’ సూచీని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఆయా అంశాల ఆధారంగా 2020–21 సంవత్సరానికి సంబంధించి తెలంగాణకు 754 పాయింట్లు వచ్చాయి. అంతకుముందు 2019–20 పీజీఐలో రాష్ట్రం 759 పాయింట్లు వచ్చాయి. ఈసారి తెలంగాణకన్నా దిగువన సిక్కిం (751 పాయింట్లు), మణిపూర్‌ (741), నాగాలాండ్‌ (728), ఉత్తరాఖండ్‌ (719), మేఘాలయ (716), అరుణాచల్‌ప్రదేశ్‌ (669) మాత్రమే నిలిచాయి. కేరళ, మహారాష్ట్రలు 928 పాయింట్లతో అన్నింటికన్నా ముందంజలో ఉన్నాయి.