కేసీఆర్​ కుటుంబం కోసమే తెలంగాణ తెచ్చుకున్నట్టయింది

కేసీఆర్​ కుటుంబం కోసమే తెలంగాణ తెచ్చుకున్నట్టయింది
  • కేసీఆర్​ కుటుంబం కోసమే తెలంగాణ తెచ్చుకున్నట్టయింది
  • కేసీఆర్​ నోరు తెరిస్తే అబద్దం..పూటకో మాట...నిలువెల్లా అహంకారం
  • బీఆర్ఎస్, బీజేపీని ఓడించండి
  • జాగో తెలంగాణ రాష్ట్ర కన్వీనర్, మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి

నాగర్ కర్నూల్, వెలుగు : పరిపాలన చేతకాని అసమర్థులు వేలకోట్ల కుంభకోణాలతో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, ఆశలను, భవిష్యత్​ను మింగేశారని, కేసీఆర్​ కుటుంబం కోసమే తెలంగాణ తెచ్చుకున్నట్లయ్యిందని జాగో తెలంగాణ రాష్ట్ర కన్వీనర్, మాజీ ఐఏఎస్ ఆఫీసర్​ఆకునూరి మురళి ఆవేదన వ్యక్తం చేశారు. పూటకో మాట, నోరు తెరిస్తే అబద్దాలు, నిలువెల్లా అహంకారం నిండిన కేసీఆర్​ను, మత విద్వేషాలతో ఫాసిస్టు పాలనకు కేరాఫ్​అడ్రస్​గా నిలిచిన మోదీ సర్కారును ఓడించే సమయం వచ్చిందన్నారు. 

తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్య వేదిక ఆధ్వర్యంలో జాగో తెలంగాణ బస్సుయాత్ర 20వ రోజైన  సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం, బిజినేపల్లిలో కొనసాగింది. జిల్లా కేంద్రంలో మార్నింగ్ వాకర్స్​తో చర్చించారు. బిజినేపల్లి  స్ట్రీట్ కార్నర్​లో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ పథకాల్లో అడ్డూ, అదుపులేని అవినీతి చేశారన్నారు. కేసీఆర్ అవినీతి మూలంగానే మేడిగడ్డ కుంగిందన్నారు. రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలను నాశనం చేశారని, నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగిందన్నారు. 

తొమ్మిదేండ్లుగా కేంద్రంలో మోదీ విధానాలను సమర్థించిన కేసీఆర్​ఎలక్షన్ల ముందు కొత్త డ్రామాలు మొదలు పెట్టారన్నారు. బీఆర్ఎస్​కు మతతత్వ ఎంఐఎం మద్దతిస్తున్నదని..బీజేపీ, బీఆర్​ఎస్, ఎంఐఎం ఒక్కటేనన్నారు. ప్రొఫెసర్లు​ లక్ష్మీనారాయణ,  పద్మజా షా, వినాయక్ రెడ్డి,  నైనాల గోవర్ధన్, యస్.ఎల్ పద్మ, డీబీఎఫ్​జాతీయ కార్యదర్శి పి.శంకర్,  రామకృష్ణ, పులి కల్పన, నిర్మల  సంధ్య, సౌజన్య, గౌస్, బాలు, రాము, సారన్న, వినయ్ పాల్గొన్నారు.

వారిని ఓడించడమే లక్ష్యంగా పని చేస్తం

ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలను చిత్తుచిత్తుగా ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామని మురళి అన్నారు. సోమవారం గద్వాలలో మాట్లాడుతూ 1200 మంది అమరుల బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణ ఫలాలను బీఆర్ఎస్ అనుభవిస్తోందన్నారు. రంజిత్ కుమార్, బుచ్చిబాబు, గోవిందు ఉన్నారు.