
ఖైరతాబాద్, వెలుగు: బలహీనమైన పాకిస్తాన్‌ను ముందుపెట్టి బీజేపీ, ఆర్ఎస్ఎస్ యువత మెదడును చెడగొడుతున్నారని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి అన్నారు. హామీల అమలులో ప్రధాని నరేంద్ర మోదీ విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జాగో తెలంగాణ, -తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో 11 రోజులపాటు నిర్వహించిన బస్సు యాత్రను శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ముగించారు. ఈ సందర్భంగా ‘‘విద్వేష విభజన, నియంతృత్వ, బడా సంపన్న అనుకూల, ప్రజా వ్యతిరేక, అప్రజాస్వామిక రాజకీయాలు చేస్తున్న బీజేపీని ఓడించండి” అనే నినాదంతో ఎన్ఆర్ఐ రామదాసు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో 12 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 83 సమావేశాలు నిర్వహించామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలు, మోదీ ప్రజలకిచ్చిన వాగ్దానాలు, ఉద్యోగాల కల్పన తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించినట్టు ఆయన చెప్పారు. అయితే, అడుగడుగునా బీజేపీ, ఆర్ఎస్ఎస్ గూండాలు అడ్డు తగులుతూ వచ్చారని వివరించారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సమావేశాలు నిర్వహిస్తూ.. ఎక్కడ వీలుంటే అక్కడ ఉన్నామని, ఎన్నో అవాంతరాల మధ్య 11 రోజులు యాత్రను సాగించినట్టు చెప్పారు.