శాలివాహన కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి..పాలకమండలిని ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలి

శాలివాహన కార్పొరేషన్  ఏర్పాటు చేయాలి..పాలకమండలిని ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలి
  •     రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు

ముషీరాబాద్, వెలుగు: కుమ్మర శాలివాహన కార్పొరేషన్  ఏర్పాటు చేసి, పాలకమండలిని నియమించి రూ. వెయ్యి కోట్లు కేటాయించాలని రిటైర్డ్  ఐఏఎస్  చిరంజీవులు డిమాండ్  చేశారు. కుమ్మర్ల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అఖిల భారతీయ కుమ్మర శాలివాహన ప్రజాపతి కుంభకార్  మహాసంఘ్  రాష్ట్ర అధ్యక్షుడు మిరుదొడ్డి శివానంద్  ప్రజాపతి అధ్యక్షతన ఆదివారం ఇందిరా పార్క్  ధర్నా చౌక్ లో మహా ధర్నా నిర్వహించారు. 

ఈ సందర్భంగా చిరంజీవులు మాట్లాడుతూ.. మానవ నాగరికతకు కుమ్మరి తొలిమెట్టు -కుండ అని చెప్పుకోవడానికి గొప్పగా ఉన్నప్పటికీ, తెలంగాణలోని కుమ్మర్ల సామాజిక స్థితిగతులు అందుకు భిన్నంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యంతో కుమ్మర్లు నేటికి విద్య, ఉద్యోగ, రాజకీయ, ఆర్థికరంగాల్లో వెనుకబడి ఉన్నారని తెలిపారు. 

రాష్ట్రం ఏర్పాటై 12 ఏండ్లు గడుస్తున్నా ప్రభుత్వాల నుంచి కుమ్మర్లకు ఆశించిన సహకారం అందలేదన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు శివానంద్  మాట్లాడుతూ కుమ్మర్ల సామాజిక స్థితిగతుల దృష్ట్యా బీసీ బి నుంచి బీసీ ఏకు మార్చాలని డిమాండ్  చేశారు. సిలివేరు శంకర్  ప్రజాపతి, ఉపాధ్యక్షులు మలికంటి వీరన్న, ఎలిశాల కృష్ణ, దొమ్మాట నాథం, సుదర్శన్, రామ్మూర్తి పాల్గొన్నారు.