మన దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. రాజ్యాంగపరమైన విషయాలు మీద, సివిల్, క్రిమినల్ విషయాల మీద సుప్రీంకోర్టు చెప్పిందే ఫైనల్. ఈ తీర్పులను తిరగదోడవచ్చా?. ఇదీ ఇప్పడు దేశ ప్రజలనే కాదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులను వేధిస్తున్న ప్రశ్న. రాజ్యాంగంలోని ఆర్టికల్ 141 ప్రకారం సుప్రీంకోర్టు ప్రకటించిన ‘లా’ అనేది భారతదేశంలోని అన్ని కోర్టులు శిరసావహించి తీరాలి.
అదేవిధంగా హైకోర్టులు, దిగువన ఉన్న కోర్టులు ఈ తీర్పులను అనుసరించాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఎదురయ్యే కేసులకు అది చట్టబద్ధమైన ఉదాహరణగా ఉంటుంది. (ప్రెసిడెంట్) సుప్రీంకోర్టు తీర్పు పాలనీయం అయినప్పటికీ అవి మార్చడానికి వీల్లేదని అనడానికి అవకాశం లేదు. కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో సుప్రీంకోర్టు తీర్పులను సమీక్ష చేయడానికి, తిరిగి పరిశీలించడానికి లేదా తోసిపుచ్చడానికి అవకాశం ఉంది.
నాలుగు విధాలుగా సుప్రీంకోర్టు తీర్పులను తిరగరాయడానికి అవకాశం ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 137 ప్రకారం న్యాయసమీక్ష చేయవచ్చు. రివ్యూ దరఖాస్తుని పార్టీలు 30రోజుల్లోగా దాఖలు చేయాల్సి ఉంటుంది. ఏ బెంచి అయితే తీర్పు చెప్పిందో అదే కోర్టుకు ఈ రివ్యూ దరఖాస్తుని సాధారణంగా పంపిస్తారు. రివ్యూ దరఖాస్తుని కోర్టు తిరస్కరిస్తే క్యూరేటివ్ దరఖాస్తు దాఖలు చేసుకునే వీలుంది. తీవ్రమైన న్యాయ విఘాతం కలిగినప్పుడు ఈ దరఖాస్తులు కోర్టు వినే అవకాశం ఉంది. ప్రధాన న్యాయమూర్తితో సహా సీనియర్ న్యాయమూర్తులు ఈ దరఖాస్తుని విచారిస్తారు. ఇద్దరు న్యాయమూర్తులు చెప్పిన తీర్పులని అంతకన్నా పెద్దదిగా ఉన్న సుప్రీంకోర్టు బెంచి తిరిగి కొత్త తీర్పుని ప్రకటించవచ్చు. ఇక చివరిది రాజ్యాంగ సవరణ ద్వారా, చట్టాన్ని మార్చడం ద్వారా కూడా సుప్రీంకోర్టు తీర్పులను తిరగరాయవచ్చు. ఇంతవరకు పర్వాలేదు. కానీ, ఇప్పుడు ఓ కొత్త ట్రెండ్ సుప్రీంకోర్టులో మొదలైంది.
కొత్త ట్రెండ్
ఒక బెంచి చెప్పిన తీర్పుపై పార్టీలు మరో బెంచికి వెళ్లడం ఈమధ్య అధికంగా జరుగుతోంది. ఈ విషయాన్ని, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కొందరు గుర్తించి తమ ఆందోళనని ఈ మధ్య వ్యక్తపరిచారు. ఆర్టికల్ 141 ప్రకారం సుప్రీంకోర్టులోని ఒక బెంచ్ ఒక నిర్దిష్ట విషయం మీద తీర్పు ఇచ్చిన తరువాత అది శాసనంగా భావించాల్సి ఉంటుంది. ఒక కొత్త అభిప్రాయం ఏర్పరచుకుని కేసుని తిరిగి విచారించడం సరైందికాదని అది ఆర్టికల్ 141కి విరుద్ధమని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు దీపాంకర్ దత్తా, అగస్టీన్ జార్జి మాష్ ఇటీవల అభిప్రాయపడ్డారు.
ఎస్కే మహమ్మద్అని సూర్ వర్సెస్ స్టేట్ఆఫ్ వెస్ట్ బెంగాల్ కేసులో సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు ఒక సాధారణ ఉత్తర్వులా అనిపిస్తుంది. అయితే, తీర్పులోని చివరి భాగం అసాధారణంగా ఉందని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. ఇద్దరు న్యాయమూర్తులు మునుపటి తీర్పులను రద్దు చేయడం బాధాకరమని, ఈ ధోరణి రాజ్యాంగంలోని ఆర్టికల్ 141కి విరుద్ధమని, అంతిమం అన్న కాన్సెప్ట్‌ను ఇది బెదిరిస్తున్నదని న్యాయమూర్తులు అభిప్రాయపడినారు.
కేసు విషయాలు
పశ్చిమ బెంగాల్‌లోని పర్చా మొదిన్పూర్లోని రాజకీయ కక్షల వల్ల ఓ హత్య 2019వ సంవత్సరంలో జరిగింది. ఈ కేసులో ప్రధాన ముద్దాయి. ఆరు సంవత్సరాలుగా జైలులో ఉన్నాడు. ఈ కేసు విచారణ కోర్టు చర్చల వల్ల కలకత్తా హైకోర్టులో దాఖలైన రిట్పిటీషన్ల వల్ల, అదేవిధంగా బదిలీ పిటీషన్ల వల్ల పదేపదే వాయిదాపడి బెయిలు మంజూరు చేయడం ద్వారా ముగుస్తుంది. ఈ కేసు విచారణని సుప్రీంకోర్టు కలకత్తాలోని సెషన్స్ కోర్టుకి బదిలీ చేసింది. అదేవిధంగా ఈ కేసును నిర్వహించడానికి ఓ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ని కూడా నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
హైకోర్టు నిందితుడికి విచారణ పూర్తయ్యేవరకు బెయిలు మంజూరు చేయరాదని ఆదేశించింది. ఆ తరువాత కలకత్తా హైకోర్టు రెహమాన్ బెయిలును తిరస్కరించింది. ఈ ఉత్తర్వుని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ని రెహమాన్ దాఖలు చేశాడు. అతని పిటీషన్ని డిసెంబర్ 2023లో సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆ తరువాత జనవరి 3, 2025 రోజున మరొక సుప్రీంకోర్టు బెంచి కొన్ని కఠినతరమైన షరతుల మీద బెయిలును మంజూరు చేసింది. కలకత్తాలోనే రెహమాన్ ఉండాలన్నది కోర్టు విధించిన షరతు.
రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం
వివాదాన్ని ఒక బెంచ్ పరిష్కరించిన తరువాత అది తుది తీర్పు అవుతుంది. ‘మరో రెండవ సవాలు’ అనేది కోర్టు అధికారాన్ని దెబ్బతీస్తుంది. అది రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం. తరువాత భిన్నమైన అభిప్రాయం మెరుగ్గా ఉన్నట్టు అనిపించిన కారణంగా కేసులను తిరిగి తెరిస్తే శాసనాల వ్యాఖ్యానం స్థిరంగా ఉండదు. బ్రౌన్ వర్సెస్ ఆల్లెన్ కేసులో రాబర్ట్ జాక్సన్ ప్రముఖంగా చెప్పిన విషయాన్ని కోర్టు ఉదహరించింది. ‘మనం తప్పు చేయమని కాదు అందుకని అంతిమంగా లేము. మనం అంతిమంగా ఉన్నాం కాబట్టి అంతిమంగా ఉన్నాం’. అంతిమం అనేది న్యాయమైన హక్కు కాదు. అంతులేని వ్యాజ్యాలను నివారించడానికి ఉద్దేశించినది. ప్రజల విశ్వాసం పోకుండా ఉండటం కోసం ఇది ఇలా చెప్పారు. అంతర్గత క్రమశిక్షణ గురించి కూడా బెంచి ప్రస్తావించింది. సమన్వయ బెంచీలు అంతర్గత క్రమశిక్షణ కలిగి ఉండాలి. మునుపటి అభిప్రాయాన్ని సమన్వయ బెంచీలు గౌరవించాలని కోర్టు అభిప్రాయపడింది. ఒకవేళ కోర్టు తీర్పులో తీవ్రమైన తప్పిదాలు ఉంటే రివ్యూ ఉంది. క్యూరేటివ్ దరఖాస్తులు ఉన్నాయి. అంతేకానీ, కొత్త బెంచీలలో ఉపశమనం కోసం వెళ్లడం సరైంది కాదు. ముందు ఇచ్చిన తీర్పును రద్దు చేయడం అంటే న్యాయం అందించినట్టు కాదు.
తీర్పులను గౌరవించాలి
బెంచీలు ఎప్పుడు మారతాయా అని చాలామంది న్యాయవాదులు ఎదురుచూస్తూ ఉంటారు. న్యాయమూర్తులు పదవీ విరమణ దగ్గరలో ఉంటే ఆ న్యాయమూర్తి పదవీ విరమణ కోసం ఎదురుచూసి ఆ తరువాత ఆ పాత లిటిగేషన్ని కొత్త రూపంలో వచ్చే ప్రక్రియను ఆపాలని బెంచీని ఆశిస్తున్నట్టు అనిపిస్తుంది. మునుపటి తీర్పు అయితే చర్చకు తీసుకోవాలి. అది చట్టం నిర్దేశించిన పద్ధతుల్లో తీసుకోవాలి. అంతేకానీ పాత లిటిగేషన్ని కొత్త లిటిగేషనుగా కాదు. సుప్రీంకోర్టులోని ఏకైక మహిళా న్యాయమూర్తి నాగరత్న ఇటీవల మాట్లాడుతూ.. తీర్పులు ఇసుకలో రాయరని, సిరాతో రాస్తారని వాటిని రాసిన న్యాయమూర్తులు పదవీ విరమణ చేసిన తర్వాత తదుపరి బెంచీలు తీసిపారేయకూడదని అన్నారు. న్యాయ సోదర భావంతో తీర్పులను గౌరవించాలని స్థిరపడిన చట్ట ప్రక్రియ ద్వారా మాత్రమే వాటిని సవాలు చేయాలని నాగరత్న అనారు.
‘ముఖాలు మారాయి’ కాబట్టి తీర్పులను విస్మరించలేమని ఆవిడ అన్నారు. ఈ మాటలు అన్నీ దీపాంకర్ దత్తా బెంచి చేసిన పరిశీలనతో ఏకీభవించాయి. ఇది ఒక నిందితుడి గురించి కాదు. సుప్రీంకోర్టు స్వీయ ఇమేజికి సంబంధించినదని, న్యాయమూర్తులు బాధతో చెప్పిన విషయాలు ఈ బెంచి హెచ్చరికను, బాధను మిగతా న్యాయమూర్తులు, ప్రధాన న్యాయమూర్తి ఏవిధంగా స్వీకరిస్తారనేది వేచి చూడాలి.
కొత్త బెంచి ముందు రెండో దరఖాస్తు
నవంబర్ 2025లో రెండు కొత్త దరఖాస్తులు న్యాయమూర్తి దీపాంకర్ దత్తా బెంచి ముందుకువచ్చాయి. తన బెయిలు షరతుని సడలించాలని రెహమాన్ దరఖాస్తు చేశాడు. అదేవిధంగా మృతుని సోదరుడు బెయిలును రద్దు చేయమని మరో దరఖాస్తు పెట్టాడు. ఈ రెండింటిని కోర్టు తిరస్కరించింది. గతంలో బెయిలు షరతులను సడలించాలని రెహమాన్ దరఖాస్తు చేసుకున్నాడు. అది ఆయనకు బెయిలు మంజూరు చేసిన బెంచి ముందుకే వచ్చింది. కానీ, ఆ దరఖాస్తుని బెంచి తిరస్కరించింది. ఆ తిరస్కరించిన బెంచిలో జస్టిస్ ఎంఎస్ ఓకా ఉన్నారు.
ఆయన పదవీ విరమణ చేసిన కొన్ని నెలల తరువాత మళ్లీ దరఖాస్తు చేశారు. బెంచిలోని కూర్పు మారిన కారణంగా అవకాశం పొందడానికి చేసిన ప్రయత్నంగా కోర్టు ఈ చర్యను అభివర్ణించింది. తమకు వ్యతిరేకంగా కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన తరువాత పార్టీలు మళ్లీ బెంచీల కూర్పు మారిన కారణంగా వస్తున్నారు. కొత్త బెంచిలు సానుభూతితో ఉంటాయని ఆశిస్తున్నారు. ఇటీవల కాలంలో తదుపరి బెంచీలు తీర్పులను రద్దుచేసే పద్ధతిని గమనించి ఇలా రెండో దరఖాస్తులను కొత్త బెంచి ముందు పెడుతున్నారు.
- డా. మంగారి రాజేందర్
జిల్లా జడ్జి (రిటైర్డ్)
రిటైర్డ్ డా. మంగారి రాజేందర్
