రిటైర్డ్‌ సైంటిస్టుకు రూ.23లక్షల టోకరా

రిటైర్డ్‌ సైంటిస్టుకు రూ.23లక్షల టోకరా

బషీర్ బాగ్, వెలుగు: అమెరికా మిలటరీ అధికారి పేరుతో ఓ రిటైర్డ్‌ సైంటిస్టును సైబర్‌ నేరగాళ్లు మోసం చేశారు. సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు తెలిపిన ప్రకారం.. సిటీకి చెందిన 80 ఏండ్ల రిటైర్డ్​ సైంటిస్టును సైబర్‌ నేరగాళ్లు వాట్సాప్‌ కాల్‌ ద్వారా సంప్రదించారు. తన పేరు మిగ్​బ్రౌన్​ అని,  యూఎస్‌ ఆర్మీలో పని చేస్తున్నానని, సిరియాలో పోస్టింగ్‌ అని నమ్మించాడు. అక్కడి విప్లవకారులు పెద్ద మొత్తంలో డాలర్లను పోగొట్టుకున్నారని, అవి తన వద్ద ఉన్నాయని నమ్మబలికాడు. ఆ డబ్బులో ముప్పై శాతం ఇస్తానని చెప్పాడు. బాధితుడి అడ్రస్, ఇతర వివరాలను సేకరించాడు. 

రెండు రోజుల తరువాత బాధితుడికి మిక్‌ బ్రౌన్‌ పేరుతో చీటర్స్‌ మరోసారి కాల్‌ చేసి తాము తీసుకొచ్చిన డాలర్లను ఢిల్లీ కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారని, కస్టమ్స్‌ వారికి పెనాల్టీ చెల్లిస్తే డాలర్లను రిలీజ్ చేస్తారని చెప్పారు. వారు చెప్పినట్లు బాధితుడు రూ. 23లక్షల59వేల200 ట్రాన్స్​ఫర్​చేశాడు. అనంతరం వారు స్పందిచకపోవడంతో మోసపోయానని తెలుసుకున్న బాధితుడు సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు. దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ శివమారుతి తెలిపారు.