ఆర్టీసీలో రిటైర్మెంట్​ ఏజ్​  పెంపు లేనట్టే!

ఆర్టీసీలో రిటైర్మెంట్​ ఏజ్​  పెంపు లేనట్టే!

హైదరాబాద్‌‌, వెలుగు : ఆర్టీసీలో ఉద్యోగుల రిటైర్మెంట్‌‌ ఏజ్‌‌ 60 ఏండ్లకే పరిమితం కానుంది. ఉద్యోగుల రిటైర్మెంట్‌‌ ఏజ్‌‌ 61 ఏండ్లకు పెంపు ఉండబోదని అధికార వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించిన ఫైల్‌‌ను ప్రభుత్వానికి పంపించినా ఇప్పటి దాకా ఎలాంటి స్పందన లేదు. దీంతో అధికారులు ఉద్యోగులకు రిటైర్మెంట్‌‌ నోటీసులు పంపిస్తున్నారు. డిసెంబర్‌‌ తర్వాత రిటైర్​ మెంట్లు షురూ కానున్నాయి. ప్రతి నెల 100 నుంచి 200మంది వరకు రిటైర్‌‌ కానున్నారు. ఆర్టీసీలో 49వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే 2019 కంటే ముందు ఆర్టీసీలో రిటైర్మెంట్ ఏజ్‌‌ 58 ఏండ్లే ఉండేది. 2019లో ఉద్యోగులు సమ్మె చేసినప్పుడు రిటైర్మెంట్ ఏజ్‌‌ను సర్కార్ 60 ఏండ్లకు పెంచింది. అప్పట్లోనే ఈ పెంపును కొందరు వ్యతిరేకించారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌‌లో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు రిటైర్ మెంటు వయసును 61 ఏండ్లకు పెంచింది. ఇదే నిర్ణయాన్ని కార్పొరేషన్లకూ వర్తింపజేసింది. ఇందులో భాగంగా ఆర్టీసీలో కూడా 61ఏండ్లకు పెంచాల్సి ఉంది. 

సర్కారు నుంచి నో రెస్పాన్స్‌‌..
రిటైర్మెంట్‌‌ ఏజ్‌‌ పెంపు ఫైల్‌‌ను ఆర్టీసీ అధికారులు ప్రభుత్వానికి పంపించారు. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. సాధారణంగా రిటైర్మెంట్‌‌ ఏజ్‌‌ తేదీ కంటే ఆరు నెలల ముందే సదరు ఎంప్లాయీస్‌‌కు నోటీసులు పంపిస్తారు. సర్కారు నుంచి క్లారిటీ లేకపోవడంతో ఇటీవల ఆర్టీసీ అధికారులు ఉద్యోగులకు నోటీసులు పంపిస్తున్నారు. ప్రతినెలా 100 నుంచి 200మంది చొప్పున ఏటా రెండు వేల మంది దాకా రిటైర్‌‌ కానున్నారు. ఫలితంగా సంస్థకు బర్డెన్‌‌ తగ్గనుంది. ఇప్పటికే సంస్థలో అదనపు స్టాఫ్‌‌ ఉన్నారు. అనేక మంది డ్యూటీలు దొరక్కపోవడంతో కార్గోకు, బస్టాప్‌‌లలో ట్రాఫిక్‌‌ కంట్రోల్‌‌కు ఉపయోగించుకుంటున్నారు. కొంత మంది రిటైర్‌‌ అయితే శాలరీ భారం కూడా తగ్గనుంది. 

ఎంప్లాయీస్‌‌ నో ఇంట్రెస్ట్‌‌..
రెండేండ్లుగా సంస్థలో రిటైర్​మెంట్లు లేవు. సాధారణంగా ఆర్టీసీలో 58 ఏండ్లు వచ్చేసరికి బస్సుల్లో డ్రైవర్‌‌, కండక్టర్, గ్యారేజీల్లో మెకానిక్‌‌లుగా పనిచేయడానికి ఇబ్బంది పడుతున్నారు. వయసు పెరగడంతో అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో మొదటి నుంచి పదవీ విరమణ వయసు పెంపును ఎక్కువ మంది ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు.