ఇండియా నుంచి వెళ్లిపోయి.. విదేశాల్లో ఉంటూ తన కేసులను సవాల్ చేయలేరని.. ఇండియా వచ్చే వరకు కేసులపై విచారణ జరగదని స్పష్టం చేసింది ముంబై హైకోర్టు. 2026, ఫిబ్రవరి 12వ తేదీన జరిగిన విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది కోర్టు. పారిపోయిన ఆర్థిక నేరస్తుల చట్టంలోని నిబంధనలను సవాల్ చేస్తూ.. విజయ్ మాల్యా తరపున అతని లాయర్లు పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేసిన కోర్టు.. భారతదేశానికి తిరిగి రావటానికి సిద్ధంగా ఉన్నారా లేదా అనేది స్పష్టం చేయాలని.. భారత కోర్టుల పరిధికి దూరంగా ఉంటూ.. చట్టపరమైన రిలీఫ్ పొందలేరని కామెంట్ చేసింది కోర్టు. కేసు విచారణ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు బాంబే హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దేశం దాటి వెళ్లిపోయి, భారత చట్టాలకు దొరకకుండా విదేశాల్లో తలదాచుకుంటూ.. ఇక్కడి కోర్టుల్లో ఊరట కోరడం కుదరదని ధర్మాసనం తేల్చిచెప్పింది. తనను పారిపోయిన ఆర్థిక నేరస్థుడిగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ మాల్యా దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీ చంద్రశేఖర్, జస్టిస్ గౌతమ్ అంఖద్‌లతో కూడిన బెంచ్ మాల్యా వైఖరిని తీవ్రంగా తప్పుబట్టింది. మీరు రిలీఫ్ పొందాలంటే ముందుగా భారతదేశానికి తిరిగి రావాలి. మీరు రానంత కాలం.. మీ పిటిషన్‌ను మేము విచారించలేమంటూ స్పష్టం చేసింది. భారత న్యాయవ్యవస్థ పరిధిలోకి రాకుండా, విదేశాల్లో ఉంటూ ఇక్కడి చట్టబద్ధమైన నిబంధనలను సవాల్ చేయడం సాధ్యం కాదని కోర్టు తేల్చిచెప్పింది. ఈ విషయంలో మాల్యా తన నిర్ణయాన్ని స్పష్టం చేస్తూ ఒక అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. మాల్యా వాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. మాల్యాను ఆర్థిక నేరగాడిగా ప్రకటించిన తర్వాతే ఆయన చట్టంలోని నిబంధనలను సవాల్ చేస్తున్నారని.. ఇది కేవలం విచారణ నుంచి తప్పించుకునే ప్రయత్నమేనని పేర్కొన్నారు. లండన్‌లో జరుగుతున్న మాల్యా అప్పగింత ప్రక్రియ దాదాపు చివరి దశకు చేరుకుందని.. ఈ సమయంలో ఇక్కడ ఉపశమనం కోసం ఆయన ప్రయత్నిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు తుషార్ మెహతా.
►ALSO READ | 114 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు లైన్ క్లియర్.. రూ.3లక్షల 25వేల కోట్ల మెగా డీల్
విజయ్ మాల్యా 2016 మార్చిలో భారీ బ్యాంక్ రుణాలను ఎగ్గొట్టి లండన్‌కు పారిపోయారు. 2019 జనవరిలో ప్రత్యేక కోర్టు ఆయనను పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిగా ప్రకటించింది. అప్పటి నుంచి ఆయన తన హోదాను, అలాగే 2018 నాటి ఆర్థిక నేరగాళ్ల చట్టం రాజ్యాంగ బద్ధతను సవాల్ చేస్తూ పిటిషన్లు వేస్తూనే ఉన్నారు. అయితే బాంబే హైకోర్టు తాజా ఆదేశాల ప్రకారం.. ఫిబ్రవరి 18 లోపు మాల్యా తన తిరుగు ప్రయాణంపై స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. లేని పక్షంలో ఆయన ఉద్దేశపూర్వకంగానే చట్టం నుంచి తప్పించుకుంటున్నారని కోర్టు రికార్డ్ చేసే అవకాశం ఉంది. ఇది ఆయనకు మరిన్ని న్యాయపరమైన చిక్కులకు భవిష్యత్తులో దారితీయెుచ్చని న్యాయ నిపుణులు అంటున్నారు.
