వారం రోజులుగా చెట్లపై సెల్ఫ్ క్వారంటైన్

వారం రోజులుగా చెట్లపై సెల్ఫ్ క్వారంటైన్

కోల్​కతా: వాళ్లంతా కూలీలు. రోజూ పనికి వెళ్తే గాని పొట్ట గడవదు. తమ రాష్ట్రం నుంచి సుదూర ప్రాంతాలకు పొట్టకూటి కోసం వెళ్లారు. దేశమంతా షట్ డౌన్ కావడంతో తిరిగి తమ సొంత గ్రామాలకు వచ్చారు. “ఎక్కడెక్కడో ప్రయాణం చేసి వచ్చాం.. మనకి ఒక వేళ కరోనా వచ్చి ఉంటే.. అది మన వాళ్లకు అంటుకుంటే ఎలా” అని భయపడ్డారు. ఆలోచన చేశారు. చెట్లపై తమను తాము సెల్ఫ్ క్వారంటైన్ చేసుకున్నారు.

ఒక మర్రి చెట్టు.. 2 మామిడి చెట్లు

పశ్చిమ బెంగాల్ లోని పురులియా జిల్లా నుంచి పని కోసం చెన్నైకి వెళ్లారు కొందరు. దేశమంతా షట్ డౌన్ కావడంతో.. కొన్ని రోజుల కిందట పురులియా జిల్లాలోని తమ ఇళ్లకు వచ్చేశారు. వాళ్లవి చాలా చిన్న ఇండ్లు. కేవలం ఒకే ఒక రూమ్ ఉండే మట్టి మిద్దెలు. దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చిన తమకు కరోనా సోకిందేమోనని భయపడ్డారు. కుటుంబంతో కలసి ఉంటే తమ వాళ్ళకి వైరస్ వస్తుందేమో అని భయపడి  సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండాలని నిర్ణయించుకున్నారు.  తమకు దగ్గరలోని ఒక మర్రి చెట్టు, 2 మామిడి చెట్ల పై ఉండాలని భావించారు. చెట్లపైన పడుకోడానికి కట్టెలతో చిన్న ఏర్పాట్లు చేసుకున్నారు. దోమతెరలు కూడా వేసుకున్నారు. ఏడుగురు వ్యక్తులు వారం రోజులుగా అక్కడే అలానే ఉంటున్నారు.

ఎంత తేడా…

చదువులకని, ఉద్యోగాలకని ఎందరో విదేశాలకు వెళ్లారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పుడు తిరిగి ఇక్కడికి వచ్చారు. వెంట వైరస్ ను మోసుకొచ్చారు. వచ్చిన వాళ్ళు హోమ్ క్వారంటైన్ లో ఉండకుండా బయట తిరిగి అందరికీ కరోనాను అంటిస్తున్నారు. కొందరు క్వారంటైన్ నుంచి తప్పంచుకుని పారిపోతున్నారు. కానీ ఈ కూలీలు.. చదువు లేదు.. ఇపుడు పని కూడా లేదు. కానీ ఎంతో ఉన్నతంగా ఆలోచించారు.

మన దగ్గరున్న ఏకైక సొల్యూషన్ లాక్ డౌనే