నేతన్నలకు అండగా రేవంత్ సర్కారు.. చేనేత రంగం అభివృద్ధికిప్రత్యేక చర్యలు : ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

నేతన్నలకు అండగా రేవంత్ సర్కారు.. చేనేత రంగం అభివృద్ధికిప్రత్యేక చర్యలు : ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
  •     సీఎం సభను విజయవంతం చేయాలి
  •     సిరిసిల్ల వస్త్ర వ్యాపార సంఘం ప్రమాణ స్వీకారోత్సవంలో విప్ ఆది శ్రీనివాస్

సిరిసిల్ల టౌన్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం నేతన్నలకు అండగా పనిచేస్తోందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. చేనేత రంగాన్ని బలోపేతం చేసి నేతన్నలకు చేతినిండా పని కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఆదివారం సిరిసిల్ల చేనేత వస్త్ర వ్యాపార సంఘం కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ఆది శ్రీనివాస్ చీఫ్​గెస్ట్​గా హాజరయ్యారు. సంఘం ప్రెసిడెంట్ తాటిపాముల దామోదర్, కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిరిసిల్ల చేనేత రంగానికి, నేతన్నలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని, చేనేత పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. సుమారు రూ.49 కోట్ల మేర నేతన్నల రుణాలను మాఫీ చేసిందన్నారు. నేతన్నలకు నిరంతరం ఉపాధి కల్పించేలా, సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను తిరిగి బలోపేతం చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. సిరిసిల్లలో ఈ నెలాఖరులో జరుగనున్న సీఎం రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయాలని విప్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రభుత్వ మాజీ విప్ అనిల్ కుమార్, తెలంగాణ పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరి శ్రీనివాస్, తెలంగాణ హాండ్లూమ్స్ కార్పొరేషన్ చైర్మన్ వెంకట రమణ, వైస్ చైర్ పర్సన్ జక్కని అనిత, మున్సిపల్ చైన్ పర్సన్ జిందం కళ, కాంగ్రెస్ నాయకులు సంగీతం శ్రీనివాస్, కేకే మహేందర్ రెడ్డి, దేవరాజు తదితరులు పాల్గొన్నారు.