
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్‌రెడ్డికి తెలంగాణపై గౌరవం లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రధాని మోదీ సాక్షిగా తెలంగాణ ఆత్మగౌరవంపై రేవంత్ దాడి చేశాడని ఆయన ఆరోపించారు. తెలంగాణ సోయి లేని వ్యక్తి సీఎం అవ్వడం ప్రజల దౌర్భాగ్యమన్నారు. గంగా జమునా తెహజీబ్ తెలంగాణ మోడల్ కన్నా, మతం పేరిట చిచ్చు పెట్టే గోద్రా అల్లర్ల గుజరాత్ మోడల్ ఎలా నచ్చిందో రేవంత్ చెప్పాలని డిమాండ్ చేశారు.
నిన్న, మొన్నటి వరకూ గుజరాత్ మోడల్‌పై విమర్శలు చేసి, ప్రధాని పక్కన సీటు ఇవ్వగానే గొప్పలు చెప్పడం ఏం నీతి అని కేటీఆర్ ప్రశ్నించారు. బుధవారం ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘‘నాడు తెలంగాణ ఉద్యమకారులపై రైఫిల్ ఎత్తావ్, నేడు తెలంగాణ ఆత్మగౌరవంపై దెబ్బ కొట్టావ్.. నిన్ను చరిత్ర క్షమించదు”అని రేవంత్‌ను కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని బీఆర్‌ఎస్ ఆకాశానికి ఎత్తిందని, కాంగ్రెస్ పాతాళంలో పాతిపెడుతోందని కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.