యురేనియం కోసం..ఎవరొచ్చినా చెట్టుకు కట్టేయండి : రేవంత్​రెడ్డి  

యురేనియం కోసం..ఎవరొచ్చినా చెట్టుకు కట్టేయండి :  రేవంత్​రెడ్డి  

నల్లమలను బొందలగడ్డగా మారుస్తారా?
గువ్వల బాలరాజు గోపాల్​పేటకు, కేసీఆర్​ ఫాంహౌజ్​కు పోతరు
నల్లమలలోని అడవి బిడ్డలుయాడికి పోవాలె?   కల్వకుంట్ల కవిత జవాబు చెప్పాలె
తవ్వకాలు ఆపేవరకూ పోరాడుతం  టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్, ఎంపీ​ రేవంత్​రెడ్డి

నాగర్​కర్నూల్, అమ్రాబాద్, వెలుగు: నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాల కోసం ఎవరొచ్చినా కండ్లల్లో కారం కొట్టాలని, వాళ్లను పట్టుకుని  చెట్లకు కట్టేయాలని టీపీసీసీ వర్కింగ్​ప్రెసిడెంట్, మల్కాజిగిరీ ఎంపీ రేవంత్​రెడ్డి పిలుపునిచ్చారు. నల్లమలలోని ఉమ్మడి అమ్రాబాద్ మండల పరిధిలో జరుగుతున్న యురేనియం వ్యతిరేక పోరాటానికి తాను మద్దతిస్తున్నానని ప్రకటించారు. శనివారం నాగర్​కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండల కేంద్రంలో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ప్రకృతి అందాలు, శైవక్షేత్రాలు, ఆదివాసీ గిరిజనులకు నిలయంగా ఉన్న నల్లమలను యురేనియం తవ్వకాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాశనం చేయడం సరికాదన్నారు.

గతంలో నల్లమలలోని చెంచుపెంటలలో పర్యటించిన మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఆదివాసీలకు బాసటగా నిలుస్తానని చెప్పారని, ఇప్పుడు ఆమె ప్రజలకు జవాబు చెప్పాలని డిమాండ్​చేశారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, సీఎం కేసీఆర్ నల్లమలలోని నిధినిక్షేపాలపై కన్నేశారని, అందుకే ఇక్కడి ప్రజల గురించి పట్టించుకోకుండా సర్వేకు సంతకాలు చేశారని రేవంత్​ ఆరోపించారు. కేంద్రం యురేనియం తవ్వుకుంటే.. వాళ్లు వజ్రాలు, బంగారాన్ని సొంతం చేసుకోవాలనే కుతంత్రానికి పూనుకున్నారన్నారు.

టీఆర్ఎస్ నేతలను బహిష్కరించండి 

నల్లమలలో యురేనియం తవ్వకాలు చేపడితే కృష్ణానది, దాని పరివాహక ప్రాంతాలతో పాటు హైదరాబాద్​ ప్రజలకూ ముప్పు ఉంటుందని రేవంత్​ చెప్పారు. యురేనియం పేరుతో ఇక్కడి ప్రజలను నిరాశ్రయులుగా మార్చి బాలరాజు గోపాల్​పేటకు, సీఎం కేసీఆర్​ఫాం హౌస్​కు పోయి పండుకుంటారని, మరి ఇక్కడి ఆదివాసీలు యాడికి పోవాలని ప్రశ్నించారు. ఆదివాసీల కూడు, గూడు, గుడ్డ నాశనం చేయాలని చూస్తే వాళ్లు విల్లంబులను గుండెల్లో దింపుతారని హెచ్చరించారు. కేసీఆర్ దిగొచ్చి అనుమతులను వెనక్కి తీసుకునేవరకూ నల్లమల ప్రజలు టీఆర్ఎస్​నాయకులను సామాజిక బహిష్కరణ చేయాలని పిలుపునిచ్చారు. ఎవరైనా ఇబ్బంది పెడితే చెప్పాలని, రెండు గంటల్లోనే మీ ముందుకొచ్చి పోరాడుతానని చెప్పారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని, ఫారెస్టు వాచర్లను విధుల్లోకి తీసుకోవాలని అటవీ అధికారులను కోరారు.

సర్కారు దిగొచ్చే వరకూ పోరాటం ఆగదు 

యురేనియం తవ్వకాలతో నల్లమల, కృష్ణా పరివాహక ప్రాంతం బొందలగడ్డగా మారిపోతాయని రేవంత్​ ఆందోళన వ్యక్తం చేశారు. యురేనియం తవ్వకాలపై ప్రభుత్వ నిర్ణయం వెనక్కి తీసుకునేవరకూ పోరాడతామని స్పష్టం చేశారు. శనివారం మహబూబ్​నగర్​జిల్లా, బల్మూర్​మండలంలోని ఆయన స్వగ్రామమైన కొండారెడ్డిపల్లికి వచ్చిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు.నల్లమలలో అనేక రకాల జంతువులతో పాటు లక్షలాది మంది ప్రజలను ఎక్కడికి పంపుతారని ప్రశ్నించారు. వెయ్యి టీఎంసీల జీవనది కృష్ణమ్మను విషతుల్యంగా మార్చి ఏం చేద్దామనుకుంటున్నారని అడిగారు. ఇక్కడ నల్లమల అభయారణ్యం, రాజీవ్​ రిజర్వ్​ టైగర్ ఫారెస్ట్​ ఉన్న విషయాన్ని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. చత్తీస్​గఢ్​, ఏపీలోని పులివెందులను పరిశీలిస్తే అక్కడి బతుకులే కాదు జననాలు కూడా ఎంత భయంకరంగా ఉంటాయో కనిపిస్తాయన్నారు.