- రాష్ట్రంలో క్రీడలకు పూర్వ వైభవం తెస్తం: సీఎం రేవంత్
- ఎల్బీ స్టేడియంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడాపోటీలు ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: ‘మత్తు వదలండి.. మైదానాన్ని చేరండి’ అనే నినాదంతో రాష్ట్రంలో క్రీడలకు పూర్వవైభవం తెస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇకపై ఎల్బీ స్టేడియాన్ని రాజకీయాలకు కాకుండా క్రీడలకు అంకితం చేస్తామని, అంతర్జాతీయ స్థాయి క్రీడా మైదానంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. రాష్ట్రంలో నూతన స్పోర్ట్స్ పాలసీని అమలు చేస్తూ, ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఇప్పటికే క్రికెటర్ సిరాజ్, బాక్సర్ నిఖత్ జరీన్‌ను డీఎస్పీలుగా నియమించామన్నారు. గచ్చిబౌలి స్టేడియం అభివృద్ధికి రూ.700 కోట్లు కేటాయించి, హైదరాబాద్‌ను మళ్లీ క్రీడల రాజధానిగా మారుస్తామన్నారు. శనివారం హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం నిర్వహించిన క్రీడా వేడుకలను సీఎం రేవంత్‌రెడ్డి క్రీడా జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలతో యువతను చైతన్యపరుస్తుంటే కొందరు ఓర్వలేకపోతున్నారని ప్రతిపక్షాలనుద్దేశించి వ్యాఖ్యానించారు. ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీని రాష్ట్రానికి తీసుకువస్తామంటే విమర్శలు చేయడం వారి అజ్ఞానానికి నిదర్శనమని మండిపడ్డారు. మెస్సీలాంటి గొప్ప క్రీడాకారులను తీసుకువస్తే రాష్ట్రానికి ఎంతో గౌరవం వస్తుందని, యువతకు స్ఫూర్తి లభిస్తుందని చెప్పారు. మెస్సీని కాకుండా డ్రగ్ డాన్స్‌ను తీసుకువస్తే వాళ్లు ఆనందిస్తారేమోనని బీఆర్‌ఎస్ నేతలను పరోక్షంగా ఎద్దేవా చేశారు. క్రీడల విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రతి ఒక్కరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు.
ప్రపంచ క్రీడాపటంలో హైదరాబాద్‌ను అగ్రస్థానంలో నిలుపుతం
ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ నగరం క్రీడల రాజధానిగా వెలుగొందిందని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. ఆఫ్రో ఏషియన్ గేమ్స్, వరల్డ్ మిలిటరీ గేమ్స్‌లాంటి అంతర్జాతీయస్థాయి పోటీలు ఇక్కడ జరిగాయని తెలిపారు. గచ్చిబౌలి స్టేడియంలాంటి అద్భుతమైన నిర్మాణాలను అప్పట్లో నిర్మించుకున్నామని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రీడలకు సరైన ప్రోత్సాహం లభించలేదన్నారు. క్రీడా స్ఫూర్తి క్రమంగా కనుమరుగైపోవడం ఆందోళన కలిగించిందని, అందుకే తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే స్పోర్ట్స్ పాలసీని తీసుకువచ్చిందని చెప్పారు. క్రీడలను మళ్లీ గాడిలో పెడతామని స్పష్టం చేశారు. ఎల్బీ స్టేడియాన్ని రాజకీయ కార్యక్రమాలకు వేదికగా కాకుండా, కేవలం క్రీడలకే పరిమితం చేస్తామని చెప్పారు. ఈ మైదానంలో శిక్షణ పొందిన ఎందరో అంతర్జాతీయ స్థాయికి ఎదిగారని తెలిపారు. భవిష్యత్‌లో మళ్లీ హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ క్రీడా పటంలో అగ్రస్థానంలో నిలుపుతామన్నారు.
దక్షిణ కొరియా స్ఫూర్తితో ముందుకు..
దక్షిణ కొరియాలాంటి చిన్న దేశాలు క్రీడల్లో సాధిస్తున్న విజయాలను చూసి మనం స్ఫూర్తి పొందాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఆ దేశ జనాభా మన తెలంగాణ కంటే తక్కువగా ఉన్నప్పటికీ.. ఒలింపిక్స్‌లో ఏకంగా 32 గోల్డ్ మెడల్స్ సాధించారని చెప్పారు. ఒకే ఒక్క స్పోర్ట్స్ యూనివర్సిటీ నుంచి 16 బంగారు పతకాలు రావడం అద్భుతమని ప్రశంసించారు. తెలంగాణలో కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. గచ్చిబౌలి స్టేడియం అభివృద్ధి కోసం రూ.700 కోట్లు కేటాయించామని, 3 నెలల్లో పనులు ప్రారంభిస్తామన్నారు. క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రపంచస్థాయి కోచ్‌లను నియమించుకుంటామని వెల్లడించారు. ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జితేందర్‌రెడ్డిని తమ ప్రభుత్వానికి సలహాదారుగా నియమించుకున్నామని చెప్పారు.
మెస్సీ రాకపై విమర్శలు తగవు
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్రీడా పోటీల్లో పాల్గొనడం ద్వారా వారిలోని దాగి ఉన్న క్రీడాకారుడు బయటకు వస్తారని సీఎం రేవంత్ అన్నారు. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, మైదానంలో గడపడం వల్ల ఉత్సాహం పెరుగుతుందని చెప్పారు. ఎమ్మెల్సీ సుఖేందర్ రెడ్డి చెప్పినట్టు ఒలింపిక్స్ పోటీల్లో క్వాలిఫై కావడం కూడా మనకు కష్టమవుతున్నదని, ఈ పరిస్థితి మారాలన్నారు. ప్రజా జీవితంలో నిరంతరం సమస్యలతో సతమతమయ్యే రాజకీయ నాయకులకు క్రీడలు మానసిక విశ్రాంతిని, సరికొత్త స్ఫూర్తిని ఇస్తాయని సీఎం రేవంత్ పేర్కొన్నారు. క్రీడలు అనేవి కేవలం గెలుపోటముల కోసం కాదని, అవి క్రమశిక్షణను, పట్టుదలను నేర్పుతాయని వివరించారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ చదువుతో పాటు ఏదో ఒక క్రీడలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. హాకీ, ఫుట్‌బాల్, క్రికెట్‌లాంటి క్రీడల్లో మన రాష్ట్రం మళ్లీ తన ఆధిపత్యాన్ని చాటాలన్నారు. అంతర్జాతీయ స్థాయి ఈవెంట్లను నిర్వహించేందుకు హైదరాబాద్ నగరాన్ని సర్వం సిద్ధం చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు.
సత్తాచాటినోళ్లకు ప్రభుత్వోద్యోగాలు
క్రీడల్లో రాణించే వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్న హామీని తమ ప్రభుత్వం అమలు చేస్తున్నదని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రపంచ కప్ సాధించిన క్రికెటర్ సిరాజ్, బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్‌కు డీఎస్పీ హోదాలో గ్రూప్-1 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. పారాలింపిక్స్‌లో పతకం సాధించిన దీప్తి జీవాంజికి గ్రూప్- 2 ఉద్యోగం కల్పించి, గౌరవించామన్నారు. తమ మంత్రివర్గంలో మాజీ క్రికెట్ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్, రంజీ క్రీడాకారుడు శ్రీహరి ఉండటం గర్వకారణమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని తెలిపారు.
