నిరుద్యోగుల ఆత్మహత్యలు.. ప్రభుత్వ హత్యలే: రేవంత్ రెడ్డి

నిరుద్యోగుల ఆత్మహత్యలు.. ప్రభుత్వ హత్యలే: రేవంత్ రెడ్డి

నిరుద్యోగుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే అన్నారు పీసీసీ  అధ్యక్షులు రేవంత్ రెడ్డి. గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడడంతో మనస్తాపం చెంది, విద్యార్థిని ప్రవల్లిక ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు.  ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షలు సరిగా నిర్వహించడం..చేతకాని పాలకులను తరిమి కొట్టాలన్నారు రేవంత్ రెడ్డి. ఇవాళ జరిగే..రాష్ట్ర వ్యాప్త రాస్తారోకోలను ప్రజలు విజయవంతం చేయాలన్నారు.  రాబోయే ఎన్నికల్లో నిరుద్యోగుల ఉసురు తీసుకుంటున్న పాలకులకు సరైన బుద్ధి చెప్పాలన్నారు . విద్యార్థిని ఆత్మహత్యపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని ట్వీట్ చేశారు రేవంత్.   

పోటీ పరీక్షల్లో వరుస లీకులు, వాయిదాలతోనే విరక్తి చెంది నిరుద్యోగి ప్రవల్లిక ఆత్మహత్య చేసుకుందన్నారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు RS ప్రవీణ్ కుమార్. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని, దీనికి కేసీఆర్ సర్కార్, TSPSC లే కారణమని ట్వీట్ చేశారు. గత మార్చిలోనే బోర్డును రద్దు చేసి, కొత్త బోర్డును నియమించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదనన్నారు. త్వరలో విద్యార్థి-నిరుద్యోగులను కాపాడుకునే బహుజనరాజ్యం వస్తుందని, ఎవరూ విలువైన ప్రాణాలు తీసుకోకండని విజ్ఞప్తి చేశారు ప్రవీణ్ కుమార్. 

Also Read :- అక్టోబర్ 14 నుంచే బతుకమ్మ సందడి

ఆత్మహత్య చేసుకున్న ప్రవల్లికకు సంతాపం తెలిపారు టీజేఎస్ చీఫ్  కోదండరామ్. ప్రభుత్వం మొండి  వైఖరి వల్లే రాష్ట్రంలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఉద్యోగాలు రాక ఇప్పటి వరకు 200 మంది విద్యార్థులు చనిపోయారన్నారు. నిరుద్యోగ సమస్యపై ఎన్ని ప్రతిపాదనలు పెట్టిన ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. క్యాలెండర్ ప్రకారం  ఉద్యోగాలు భర్తీ చేస్తే ఇలాంటి సమస్యలు వచ్చి ఉండేవి కాదంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ మొండి వైఖరి మానుకోవాలన్నారు. ఈ రోజు చేసే సడక్ బంద్ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక అన్నారు కోదండరామ్.