
చేవెళ్ల, వెలుగు: చేవెళ్ల సెగ్మెంట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి పామెన భీం భరత్ గెలుపునకు సహకరించాలని అసంతృప్త నేత సున్నపు వసంతంను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కోరారు. చేవెళ్ల టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా సున్నపు వసంతం నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి శనివారం సున్నపు వసంతంను పిలిపించుకుని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
చేవెళ్లలో భీం భరత్ గెలుపు కోసం కృషి చేయాలని, రెబల్ అభ్యర్థిగా వేసిన నామినేషన్ను విత్ డ్రా చేసుకోవాలని సూచించారు. రేవంత్ రెడ్డిని కలిసిన అనంతరం సున్నపు వసంతం చేవెళ్లలో భీం భరత్ తో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. భరత్ గెలుపు కోసం తాను పనిచేస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం పామెన భీం భరత్ వెంకన్నగూడ, రావులపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వెంకన్నగూడ గ్రామానికి చెందిన కొండనోళ్ల రాంరెడ్డి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు.
అదేవిధంగా పామెన భీం భరత్ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన పలు పార్టీల నేతలు కాంగ్రెస్లో చేరారు. శంకర్ పల్లి టౌన్, మండలంలో భీం భరత్ ప్రచారం నిర్వహించారు. శంకర్పల్లి మున్సిపాలిటీ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు మంజులా రెడ్డి ఆయన సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా భీం భరత్ మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్ఎస్ ను తరిమికొట్టి కాంగ్రెస్కు అధికారం ఇవ్వాలన్నారు.