కొత్త మలుపు తిరుగుతున్న టీఎస్​పీఎస్సీ పేపర్​ లీక్​ కేసు

కొత్త మలుపు తిరుగుతున్న టీఎస్​పీఎస్సీ పేపర్​ లీక్​ కేసు
  • పేపర్​ లీక్​ ఆరోపణలపై ఆధారాలు
  • ఇవ్వలేదని లీగల్ ​యాక్షన్​కు రెడీ  
  • లీగల్ ఒపీనియన్​ తీసుకుంటున్నం : సిట్​ చీఫ్​
  • సిట్ విచారణకు హాజరై.. కామెంట్స్‌‌పై వివరణ ఇచ్చిన పీసీసీ చీఫ్​
  • ఇయ్యాల సిట్‌‌ ముందుకు బీజేపీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్​

హైదరాబాద్‌‌, వెలుగు : టీఎస్​పీఎస్సీ పేపర్​ లీక్​ కేసు కొత్త మలుపు తిరుగుతోంది. ఈ వ్యవహారంపై ఆరోపణలు చేసిన పీసీసీ చీఫ్​ రేవంత్‌‌రెడ్డిపై లీగల్ యాక్షన్‌‌ తీసుకునేందుకు సిట్‌‌ సిద్ధమవుతోంది. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో 100 మందికిపైగా గ్రూప్‌‌1లో క్వాలిఫై అయ్యారంటూ రేవంత్‌‌ చేసిన కామెంట్స్​కు ఆధారాలను ఇవ్వాలని సిట్‌‌ నోటీసులు ఇచ్చింది. దీంతో రేవంత్‌‌ రెడ్డి గురువారం హైదరాబాద్​ హిమాయత్​నగర్​లోని సిట్​ ఆఫీసులో విచారణకు హాజరయ్యారు. సిట్‌‌ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్‌‌ను కలిసి.. తాను చేసిన కామెంట్స్‌‌ పై వివరణ ఇచ్చారు. ఐటీ మంత్రి కేటీఆర్‌‌‌‌ ,టీఎస్‌‌పీఎస్సీ చైర్మన్‌‌ వెల్లడించిన వివరాల ఆధారంగానే తాను మాట్లాడానని స్పష్టం చేశారు.

వంద మందికి పైగా అభ్యర్థులకు 100 మార్కులు వచ్చాయని తాను చెప్తే.. వాళ్లను విచారించాల్సింది పోయి రివర్స్​లో తమకు నోటీసులిచ్చి సర్కారు భయపెట్టే ప్రయత్నం  చేస్తున్నదన్నారు. అయితే ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను  రేవంత్‌‌ రెడ్డి అందించలేదని ఆయనపై కేసు పెట్టేందుకు సిట్‌‌ రెడీ అవుతున్నట్లు తెలిసింది.  రేవంత్​ పై చట్టపరమైన చర్యలకు లీగల్ ఒపీనియన్‌‌ తీసుకుంటున్నామని సిట్‌‌ చీఫ్‌‌ ఏఆర్‌‌‌‌ శ్రీనివాస్‌‌ వెల్లడించారు. బండి సంజయ్‌‌ శుక్రవారం సిట్‌‌ విచారణకు హాజరుకావాల్సి ఉంది. పేపర్​ లీక్​పై చేసిన ఆరోపణలకుగానూ సంజయ్​ కు కూడా  సిట్  నోటీసులు జారీ చేసింది. ఆరోపణలపై ఆధారాలను ఇవ్వాలని కోరింది.