- అందుకే ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టులు పెండింగ్‌లో పడ్డయ్
- అంచనాల్లో 50 శాతం ఖర్చు పెడితే 90 శాతం పనులు ఎట్లా పూర్తవుతాయి?
- అంతా దోచుకొని మమ్మల్ని దోషులుగా చూపాలని చూస్తున్నరు
- 30 నెలల్లో పాలమూరు పెండింగ్ప్రాజెక్టులు పూర్తి చేస్తం
- 26 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తామని వెల్లడి
- మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి
మహబూబ్‌నగర్, వెలుగు: పాలమూరు– రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలో గత బీఆర్ఎస్ప్రభుత్వం పంపులు, లిఫ్టులు మాత్రమే కట్టించి, కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు తీసుకుందని.. కీలకమైన భూసేకరణను మాత్రం పట్టించుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని కర్వెన రిజర్వాయర్‌ను పరిశీలించిన అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. తాను, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు కలిసి ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను పరిశీలించామన్నారు. కేసీఆర్హయాంలో ఇరిగేషన్‌శాఖపై రూ.1.80 లక్షల కోట్లు ఖర్చుచేసినా, పాలమూరు ప్రాజెక్టులను పట్టించుకోలేదన్నారు.
పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 26 లక్షల ఎకరాలకు సాగు నీరు అందేదన్నారు. ‘ప్రాజెక్టులు నిర్మించాలంటే భూములు కావాలి. భూసేకరణ చేయాలి. కానీ ఈ విషయం కేసీఆర్‌కు తెలవలేదు’ అని ఎద్దేవా చేశారు. కెనాల్స్ కు భూసేకరణ చేయలేదని, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వలేదని, కేవలం పంప్‌హౌస్‌లు కట్టి, కొన్ని మోటార్లు పెట్టినంత మాత్రాన ప్రాజెక్టులు పూర్తయినట్టేనా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం రూ.55 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసిందని, అందులో రూ.27 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. మరి 50 శాతం నిధులు ఖర్చు చేయకుండా 90 శాతం పనులు ఎలా జరిగాయో చెప్పాలన్నారు. ఇందులో ఉన్న సైన్స్, మ్యాథ్స్ ఏమిటని ప్రశ్నించారు.
‘పంపులు, సంపులకే రూ. 27 వేల కోట్లు పెట్టి కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు తీసుకున్నారు. సివిల్ వర్క్ లకు, భూసేకరణకు డబ్బులే ఇయ్యలేదు. దీంతో పనులన్నీ పెండింగ్‌పడ్డాయి. అంచనా వ్యయం మరింత పెరిగే పరిస్థితి వచ్చింది’ అని విమర్శించారు. అధికారులు, ప్రజాప్రతినిధుల సాయంతో రైతుల నుంచి భూసేకరణ స్పీడప్ చేయాలని సూచించామన్నారు. ఈ ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు ఇదో మంచి అవకాశమని, బీఆర్ఎస్నేతలు అడ్డుకోవద్దని కోరారు.
వడ్లు తీసుకోకుంటే బీజేపీ నేతల సంగతి చెప్తా..
కేంద్రం మద్దతు ధరలు ప్రకటించి, పంటలను కొనకుండా పక్కకు తప్పుకుంటోందని, భారమంతా రాష్ట్ర ప్రభుత్వాలపై పడుతోందని సీఎం రేవంత్ ఫైర్అయ్యారు. ‘రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని పీఎం చెప్పారు. పంటలను కొనకుండా రైతులను ఎలా రాజులను చేస్తారు?’ అని ప్రశ్నించారు. రాష్ట్రం కొనుగోలు చేసిన 75 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను కేంద్రమే తీసుకోవాలని, లేదంటే బీజేపీ నేతల సంగతి చెప్తామన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటాలో చుక్క నీటికి కూడా వదులుకోబోమని, ఆరు నెలల్లో కృష్ణా జలాల సమస్యలను పరిష్కరించి డిసెంబర్‌కల్లా శుభవార్త చెప్తామన్నారు. కర్నాటక మాదిరిగా బ్రిడ్జి కం బ్యారేజీలతో గ్రౌండ్వాటర్సమస్యను నివారిస్తామని సీఎం రేవంత్ రెడ్డివెల్లడించారు.
