రాష్ట్రంలో డిసెంబర్ లో ఎన్నికలోస్తాయన్నారు టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డి. జూన్, జులైలో కొత్త ప్రభుత్వం వస్తుందని... అది కూడా కాంగ్రెస్ పార్టీయేనని ధీమా వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లాలోని పరిగిలో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ మెంబర్షిప్ డిజిటల్ కార్డుల ఆవిష్కరణ సభలో పాల్గొన్నారు రేవంత్. పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు, ఉద్యమకారులు బాగుపడాలంటే అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని అన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని సూచించారు. ప్రతి గడప తట్టి ప్రజల సమస్యలను తెలుసుకొని పార్టీలో చేర్పించాలని కోరారు రేవంత్. కాంగ్రెస్ పార్టీ మెంబర్షిప్ చేయించే కార్యకర్తలే పార్టీకి బ్రాండ్ అంబాసిడర్స్ అని తెలిపారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని, వారికి అండగా ఉంటామని అన్నారు. నిత్యం కష్టపడితేనే మాయల ఫకీరు కేసీఆర్ ను ఎదుర్కొవచ్చునని రేవంత్ వ్యాఖ్యనించారు. కార్యకార్తలు అనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయమని, ప్రశాంత్ కిషోర్ లాంటివాళ్లు అవసరమే లేదని అన్నారు.
అటు మోడీ పైన విమర్శలు చేశారు రేవంత్. గాంధీ కుటుంబాన్ని చూస్తే మోడీకి భయం మొదలైందని, పాత కేసులు తోడి ఈడీ నోటీసులు ఇప్పిస్తున్నాడని ఆరోపించారు. దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన కుటుంబంపై కుట్రలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు.
