
- దినసరి కూలీలను ఆదుకోండి
- చర్యలు తీసుకోకపోతే రేపు జీహెచ్ఎంసీ ఆఫీస్ ముట్టడిస్తాం
- మంత్రి కేటీఆర్ కు రేవంత్ రెడ్డి లేఖ
హైదరాబాద్ : వరద ప్రభావిత ప్రజలకు రూ. 10 వేల సాయం ప్రకటించాలని, వర్షాల కారణంగా బయటకు వెళ్లలేని దినసరి కూలీలను ఆదుకోవడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని టీ పీసీసీ చీఫ్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ నగరం విలవిలలాడుతోందని, గల్లీ ఏరైంది.. కాలనీ చెరువైందని , రోడ్లన్నీ చెరువులుగా మారిపోయాయని, బస్తీలు, కాలనీలు జలమయమయ్యాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఇవాళ రాష్ట్ర ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్ కు ఒక లేఖ రాశారు.
ఈ పరిస్థితుల్లో బాధ్యతయుతమైన పదవిలో ఉన్న మీరు ప్రజలను గోసను పట్టించుకోకుండా పత్తా లేకుండా పోయారని, పుట్టిన రోజులు చేసుకుంటూ ప్రజలను మీ చావు మీరు చావండి అని వారి మానానికి వారిని వదిలేసి అని నిసిగ్గుగా బాధ్యతల నుంచి పారిపోతున్నారని విమర్శించారు.
‘సందర్భం వచ్చినప్పుడల్లా హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దామని సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడానికి తండ్రి కొడుకులు పోటి పడుతుంటారని, యావత్ ప్రపంచం హైదరాబాద్ వైపు చూస్తోందని ఉద్దెర ముచ్చట్లు చెబుతుంటారు. ప్రపంచ దేశాల సంగతేమో గానీ నగర ప్రజలే బయటకు రావడానికి ఒకటికి పది సార్లు ఆలోచించుకునే దుస్థితిని హైదరాబాద్ కు కల్పించారు.
ఎక్కడ గుంత ఉందో, ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో అని ప్రజలు ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుంటూ తిరిగాల్సిన పరిస్థితిని కల్పించారు. విశ్వనగరమో.. విషాద నగరమో తేలిపోయింది. హైదరాబాద్ నగరంలో ఇంత విధ్వంసం జరుగుతుంటే కనీసం సమీక్ష చేసే సమయం మీకు లేదు.
వాతావరణ శాఖ ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించింది. అయిన కూడా ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదు. లోతట్టు ప్రాంతాలు నీట మునిగి ప్రజల సహాయం కోసం హాహాకారాలు చేస్తున్న పట్టించుకునే తీరిక లేదు. ఇప్పటికైనా మీదైన కలల ప్రపంచం నుంచి బయటికి వచ్చి ప్రజల కష్టాలను తీర్చే ప్రయత్నం చేయండి.
లేకపోతే రేపు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అమరుల స్థూపం వరకు ర్యాలీగా వెళ్లి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం. మీ చేతగాని తనాన్ని ఎండగట్టి తగిన బుద్ధి చెబుదాం’ అని లేఖలో హెచ్చరించారు.