పదవి, కమీషన్ల కోసం పార్టీకి కౌశిక్ రెడ్డి ద్రోహం చేశాడు : రేవంత్ రెడ్డి

పదవి, కమీషన్ల కోసం పార్టీకి కౌశిక్ రెడ్డి ద్రోహం చేశాడు : రేవంత్ రెడ్డి

హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలో కాంగ్రెస్ పార్టీ గుండెల మీద తన్ని.. వైరి పక్షం (బీఆర్ఎస్) లో పాడి కౌశిక్ రెడ్డి చేరాడని రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. ఎమ్మెల్సీ పదవి కోసం, కమీషన్ల కోసం కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేశాడని ఆరోపించారు. ఆ సమయంలో పార్టీకి అండగా బల్మూరి వెంకట్ ఉన్నాడని, ఆయనకు కాంగ్రెస్ లో మంచి భవిష్యత్తు ఉంటుందని హామీ ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వ మెడలు వంచి.. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో బాధ్యులను జైలుకు పంపింది బల్మూరి వెంకటే అని చెప్పారు. హుజురాబాద్ జమ్మికుంటలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరీ సభలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై తెలంగాణ పీసీసీ ఛీప్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.   

హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలో ఈటల మాటలకు ఆయన్ను గెలిపిస్తే.. నియోజకవర్గానికి కేంద్రం నుంచి ప్రత్యేకంగా ఏమైనా నిధులు తీసుకొచ్చాడా..? అని ప్రశ్నించారు. చంపుకుంటారా.. ? సాదుకుంటారా..? అని దొంగ ఏడ్పులు ఏడిస్తే.. పాపమని ఇక్కడి ప్రజలు ఈటలను గెలిపించారని చెప్పారు. కేసీఆర్ తో యుద్ధం చేసి గెలిచిన ఈటల రాజేందర్.. కేంద్రం నుండి ఏమైనా నిధులు తెచ్చారా..? అని ప్రశ్నించారు. నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికలు ఆషామాషీ ఎన్నికలు కాదు.. దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలా..? రాజరికం రావాలా అని నిర్ణయించేవి అని చెప్పారు. 

30 లక్షల మంది నిరుద్యోగులు సైనికులై బీఆర్ఎస్ పాలనను పాతరేయాలని పిలుపునిచ్చారు. ప్రజల కోరిక నెరవేరాలన్నా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నా నవంబర్ 30వరకు ఇదే ఉత్సాహం కొనసాగించాలని చెప్పారు. హుజురాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఒకసారి హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రణవ్ కి ఓట్లు వేసి గెలిపించండి అని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో సమూలమైన మార్పు రావాలి.. దొరల పాలన పోవాలి అని పిలుపునిచ్చారు. ఆరు గ్యారంటీలు సాధ్యం కావాలంటే ప్రణవ్ ను గెలిపించాలన్నారు.