విద్యుత్ కొనుగోలు పై విచారణ జరిపించాలి: రేవంత్ రెడ్డి

విద్యుత్ కొనుగోలు పై విచారణ జరిపించాలి: రేవంత్ రెడ్డి

విద్యుత్‌ కొనుగోళ్లలో అక్రమాలు లేవని టీఆర్‌ఎస్‌ బుకాయిస్తోందని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్‌ రెడ్డి విమర్శించారు. గతంలో ప్రభుత్వం జెన్ కో, డిస్కం, పంపిణీ సంస్థలకు సీనియర్ ఐఏఎస్ లను CMDలు గా నియమించేదన్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అర్హత లేని ప్రభాకర్ రావును నియమించి దోపిడీకి పాల్పడుతోందని ఆరోపించారు. తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌ కో CMD ప్రభాకర రావు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని, కేసీఆర్  దోపిడీకి సహకరిస్తున్న ఆయనను గన్‌పార్క్‌ ముందు నిలబెట్టి కాల్చినా తప్పులేదన్నారు రేవంత్‌రెడ్డి.

ఛత్తీస్ గఢ్ తో దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు అగ్రిమెంట్ కారణంగా వేల కోట్ల అదనపు భారం పడిందన్నారు రేవంత్. దీనిపై ఈఆర్‌సీకి ఫిర్యాదు చేశామని, అప్పటి ప్రిన్సిపాల్‌ సెక్రటరీ కూడా కొనుగోళ్లను తప్పుబట్టారని ఆయన చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి 1000 మెగావాట్ల కొనుగోలు వెనుక అదాని కంపెనీ హస్తం ఉందన్నారు. విద్యుత్‌ను కేసీఆర్‌ ఆర్థిక వనరుగా మార్చుకున్నారని విమర్శించారు. తక్కువ ధరకు 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి సరఫరా చేస్తామని ఎన్టీపీసీ చెప్పినా దానికి స్థలం కేటాయించడం లేదన్నారు.

అత్యవసర విద్యుత్‌ కొనుగోళ్ల పేరుతో దోపిడీకి పాల్పడ్డారని, కేసీఆర్‌ అవినీతిపై ఫిర్యాదు చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. విచారణ జరిపించడానికి లక్ష్మణ్‌, నడ్డా, కిషన్‌రెడ్డి సిద్ధమా అంటూ సవాల్ చేశారు. తన ఆరోపణలు తప్పైతే ఏ శిక్షకైనా సిద్ధమన్నారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ డ్రామాలు ఆపాలని…. సీబీఐ విచారణకు బీజేపీని అడ్డుకుంటున్నది ఎవరని ప్రశ్నించారు రేవంత్‌ రెడ్డి.