
సీఎం కేసీఆర్, మంత్రి మల్లారెడ్డి కలిసి తోడు దొంగల్లా మేడ్చల్ జిల్లాలో భూములను కబ్జా చేస్తున్నారని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రాన్ని కేసీఆర్ ఆగం చేశారని, పేదలు బతికే పరిస్థితి లేకుండా చేశారని మండిపడ్డారు. ‘‘లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం మూడేండ్లకే కుంగింది.. తెలంగాణను ఆగం చేసిన కేసీఆర్‌ను పొలిమేర దాకా తరమాలి’’ అని అన్నారు.
కరెంట్, రైతు బంధు విషయంలో కాంగ్రెస్‌పై కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దాన్ని ప్రజలు ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మరని అన్నారు. గురువారం మేడ్చల్ జిల్లాలోని మేడ్చల్ పట్టణం, జవహర్‌నగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర వజ్రేశ్ యాదవ్ తరఫున నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో రేవంత్ పాల్గొని మాట్లాడారు. జవహర్‌నగర్ ప్రజలకు కేసీఆర్ ఇచ్చిందేమీ లేదని, డంపింగ్ యార్డ్ తప్ప అని మండిపడ్డారు. ‘‘జవహర్‌నగర్ డంపింగ్ యార్డును తరలించాలని కోర్టు ఆదేశాలిచ్చినా.. సీఎం పట్టించుకోలేదు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది” అని తెలిపారు. పేదోళ్ల గుడిసెలను మల్లారెడ్డి కూల్చి.. వారికి నిలువ నీడ లేకుండా చేశారని అన్నారు. ‘‘పేదలపై ప్రతాపం చూపే అధికారులు.. చెరువులను మింగిన మంత్రి మల్లారెడ్డిపై చర్యలెందుకు తీసుకోరు?” అని ప్రశ్నించారు. చెరువుల పక్కన భూములు కొని.. చెరువులను మింగిన ఘనుడు మల్లారెడ్డి అని ఆరోపించారు.‘‘టికెట్లు అమ్ముకున్న మల్లారెడ్డికి.. కేసీఆర్ మళ్లీ టికెట్ ఇచ్చిండు. మరి కేసీఆర్ ఎన్ని వందల కోట్లకు టికెట్ అమ్ముకున్నడు” అని దుయ్యబట్టారు. మేడ్చల్ కు తెస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన ఐటీ పార్కు ఎటు పోయిందని ఆయన ప్రశ్నించారు.
ముదిరాజ్‌లకు కేసీఆర్ ఒక్క టికెట్ కూడా ఇయ్యలే
ముదిరాజ్‌లకు ఒక్క టికెట్ కూడా కేసీఆర్ ఇవ్వలేదని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్‌ను, బీఆర్ఎస్ సర్కార్‌ను గద్దె దింపే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ‘‘సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోయి ఉంటే కేసీఆర్ ఫ్యామిలీ అడుక్కొని తినేది. తెలంగాణ ప్రజలను దోచుకుంటున్నడు. కేసీఆర్ ఫ్యామిలీకి వేల కోట్ల రూపాయల ఆస్తులు, ఫామ్ హౌస్‌లు ఎట్ల వచ్చినయ్? కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత 22 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టిండు.. ఒక్క రూపాయి అయినా పేదలకు ఇచ్చిండా?” అని మండిపడ్డారు.
ఆరు గ్యారంటీలు పక్కాగా అమలు చేస్తం
కాంగ్రెస్ పార్టీకే ఓటు వేసి గెలిపించాలని ప్రజలను రేవంత్‌రెడ్డి కోరారు. ‘‘సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అమలుచేసి తీరుతం. మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు ప్రతినెలా రూ.2,500 ఇస్తం. రూ.500కే సిలిండర్ ఇస్తం. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందజేస్తం. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తం” అని ప్రకటించారు. ఆడబిడ్డ పెండ్లికి రూ.లక్ష నగదుతోపాటు తులం బంగారం అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ‘‘తెలంగాణలో ప్రజల పాలన రావాలి.. దొరల రాజ్యం పోవాలి” అని అన్నారు.