రాజకీయ ప్రయోజనాల కోసమే ఈడీ నోటీసులు

రాజకీయ ప్రయోజనాల కోసమే ఈడీ నోటీసులు

రాజకీయ ప్రయోజనాల కోసమే రాహుల్ గాంధీ, సోనియా గాంధీలపై ఈడీతో కేసులు పెట్టిస్తున్నారని టీపీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈడీ పేరుతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న కేంద్రం వైఖరిని నిరసిస్తూ టీ కాంగ్రెస్ హైదరాబాద్ ఈడీ ఆఫీస్ ఎదుట చేపట్టిన నిరసన దీక్షలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్.. బీజేపీ విద్వేష భావజాలాన్ని తిప్పికొట్టి ప్రజా సమస్యలను బయటపెట్టేందుకే నేషనల్ హెరాల్డ్ పత్రికను తిరిగి ప్రారంభించారని చెప్పారు. అయితే ఈ పత్రిక ద్వారా తమ కుట్రలు బయటపడతాయనే భయంతోనే ఈడీతో కేసులు పెట్టించారని రేవంత్ విమర్శించారు.  

దేశభక్తిని పెంపొందించడానికి నేషనల్ హెరాల్డ్ ను నడిపించారని రేవంత్ చెప్పారు. ఉద్యోగుల జీతాల కోసం 90 కోట్ల పెట్టుబడులు పెట్టారని..లాభాల కోసం నేషనల్ హెరాల్డ్, యంగ్ ఇండియా సంస్థలు పనిచేయవని తెలిపారు. డబ్బులు చేతులు మారలేదు కాబట్టి ఆర్థికనేరం కింద విచారణ చేయడానికి వీల్లేదని ఈడీ గతంలోనే  చెప్పిందని..అయితే కాంగ్రెస్ ప్రజలకు దగ్గర అవుతుందనే ఉద్దేశ్యంతో మళ్లీ ఈడీ కేసులు పెట్టి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను వేధిస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే 14 ఏళ్ల తర్వాత ఈ కేసులను మళ్లీ తెరపైకి తెచ్చారన్నారు. అయితే ఈ కుట్రలను కాంగ్రెస్ తిప్పికొట్టి మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం  చేశారు.

అధికారం ఎవరికీ శాశ్వతం కాదని..మోడీ, అమిత్ షా రాక్షసంగా వ్యవహరిస్తున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లి ఆరోగ్యం బాగోలోని సమయంలో రాహుల్ ను విచారణ పేరుతో అర్థరాత్రి వరకు ఈడీ ఆఫీసులోనే ఉంచడం మోడీ అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. ప్రజలు బీజేపీ కుట్రలను గమనిస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో వారే ఆ పార్టీకి తగిన సమాధానం చెప్తారని అన్నారు. దేశ చరిత్రలో ఇంత బరితెగించిన ప్రధానిని ఎప్పుడు చూడలేదని.. దేశం కోసం ప్రాణాలను ఇచ్చిన కుటుంబాలను అవమానిస్తున్నారని అన్నారు.