రిక్రూట్మెంట్లపై కొత్త సర్కార్ నజర్..

రిక్రూట్మెంట్లపై కొత్త సర్కార్ నజర్..
  • రిక్రూట్మెంట్లపై కొత్త సర్కార్ నజర్
  • పోస్టుల భర్తీపై త్వరలోనే సీఎం రివ్యూ చేసే చాన్స్ 
  • డిపార్ట్ మెంట్ల వారీగా ఖాళీల వివరాలు సేకరణ
  • నోటిఫికేషన్ల స్టేటస్ పైనా దృష్టిపెట్టిన ఆఫీసర్లు   

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో జాబ్ రిక్రూట్మెంట్లపై కొత్త సర్కారు దృష్టి సారించింది. టీఎస్ పీఎస్సీతో సహా వివిధ బోర్డుల ద్వారా జరుగుతున్న నియామకాల వివరాలను సేకరిస్తోంది. ఎన్నికల్లో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు చర్యలు మొదలుపెట్టింది. డేటా మొత్తం సిద్ధమయ్యాక త్వరలోనే పోస్టుల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నట్టు అధికారులు చెప్తున్నారు. జాబ్ క్యాలెండర్ కు అనుగుణంగా పోస్టుల భర్తీపై చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొంటున్నారు. 

ఇందులో భాగంగా కొత్త సర్కారు రిక్రూట్మెంట్ స్టేటస్ డేటాను సేకరిస్తున్నట్టు వెల్లడించారు. ఇప్పటికే టీఎస్​పీఎస్సీ, గురుకుల, మెడికల్, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులు, స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులతో సీఎస్ శాంతికుమారి ఆదేశాలతో ఫైనాన్స్ డిపార్ట్ మెంట్అధికారులు సమీక్షించారు. జారీ చేసిన నోటిఫికేషన్లు ఎన్ని? ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు? స్టేటస్ ఏంటీ? అనే వివరాలను సేకరించారు. ఎగ్జామ్స్, రిజల్ట్, ఫైనల్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఎన్నిరోజుల్లో ఇచ్చే చాన్స్ ఉంటుదనే డేటాను కూడా అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వంలో ఎన్ని పోస్టులకు ఫైనాన్స్ శాఖ క్లియరెన్స్ ఇచ్చింది? ఎన్ని నోటిఫికేషన్లు రిలీజ్ అయ్యాయనే అంశాలపైనా చర్చించారు. దీంతో పాటు వివిధ డిపార్ట్ మెంట్లలో వాస్తవంగా ఉన్న ఖాళీలు.. నోటిఫికేషన్లలో పేర్కొన్న పోస్టుల మధ్య వ్యత్యాసం ఎంత అనే దానిపైనా దృష్టిపెట్టినట్టు తెలిసింది. 

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీతో పాటు గ్రూప్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తామని తేదీలతో సహా జాబ్ క్యాలెండర్ ను ఆ పార్టీ రిలీజ్ చేసింది. ప్రస్తుతం దీనికి అనుగుణంగా ఏ మేరకు మార్పులు చేయొచ్చనే దానిపై సర్కారు దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పరీక్షలు జరిగి, చివరి దశలో ఉన్న వాటిపైనా, ఇంకా పరీక్షలు జరగని వాటిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.