
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరంగల్ వెళ్తుండగా ఆయనను ఘట్కేసర్ టోల్ ప్లాజా వద్ద అడ్డుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. సికింద్రాబాద్ ఘటనలో చనిపోయిన రాకేష్ కుటుంబసభ్యులను పరామర్శించేందుకు రేవంత్ రెడ్డి వెళ్తుండగా ఏసీపీ శ్యామ్ సుందర్, 10 మంది సీఐలు ఆయనను అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన రేవంత్ రెడ్డి ఏసీపీతో వాగ్వాదానికి దిగారు. రేవంత్ రెడ్డికి సంఘీభావం తెలుపుతున్న ఘట్ కేసర్ కాంగ్రెస్ శ్రేణలు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నారు.
రాకేష్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న తనను అడ్డుకోవడంపై రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. మృతుని కుటుంబాన్ని కలిసేందుకు వెళ్తే పోలీసులకు వచ్చిన ఇబ్బందేంటని ప్రశ్నించారు. టీఆర్ఎస్ మంత్రులు గులాబీ జెండాలు పట్టుకుని అంతిమయాత్రలో పాల్గొంటున్నప్పుడు కాంగ్రెస్ నాయకులు అక్కడికి వెళ్లేందుకు ఇన్ని అడ్డంకులు ఎందుకు సృష్టిస్తున్నారని నిలదీశారు. టీఆర్ఎస్ చావులను కూడా రాజకీయంగా వాడుకోవాలని చూస్తోందన్న రేవంత్ ప్రజలను ఎక్కువ కాలం మోసం చేయలేరని అన్నారు. త్వరలో సిరిసిల్లలో నిరుద్యోగ డిక్లరేషన్ ప్రకటిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.