పాదయాత్రకు కోమటిరెడ్డిని ఆహ్వానించిన భట్టి

పాదయాత్రకు కోమటిరెడ్డిని ఆహ్వానించిన భట్టి

మార్చి 16 నుంచి తాను చేయబోయే పాదయాత్రకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఆహ్వానించానని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. అంతకుముందు హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కోమటిరెడ్డి నివాసంలో ఆయనను కలిసిన భట్టి.. తన పాదయాత్రలో కోమటిరెడ్డి కూడా పాల్గొంటారని స్పష్టం చేశారు. యాత్రకు సంబంధించిన కొన్ని సూచనలు చేశారని చెప్పారు. పీసీసీ చీఫ్ పాదయాత్ర వేరే రూట్ లో ఉందని, తన పాదయాత్ర మరో రూట్ లో వెళుతుందని భట్టి అన్నారు. అరవై శాతం టిక్కెట్లు కన్ఫార్మ్ అయ్యాయన్న  విషయంపై తనకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు.

సీఎల్పీ నేత భట్టి మండుటెండలో పాదయాత్ర చేయబోతున్నారని.. జాగ్రత్తగా చేయండని తాను ఆయనకు సలహా ఇచ్చినట్టు ఎంపీ కోమటిరెడ్డి చెప్పారు. గతంలో వైఎస్ఆర్ పాదయాత్ర చేసిన సమయంలో తాను ఆయన పక్కనే ఉన్నానన్న ఆయన... పెద్ద సెంటర్లలో బహిరంగ సభలు పెట్టమని సూచించానని తెలిపారు. ఈ పాదయాత్రలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోమటిరెడ్డి పిలుపునిచ్చారు. మంచిర్యాలతో పాటు జడ్చర్ల లేదా షాద్ నగర్ లో పబ్లిక్ మీటింగ్ పెడుతున్నామన్నారని, నల్గొండలోనూ పెద్ద బహిరంగ సభ పెట్టాలని కోరానన్నారు. దానికి వారు ఒప్పుకున్నారని చెప్పారు. నకిరేకల్, సూర్యాపేటలలోనూ మినీ పబ్లిక్ మీటింగ్ పెట్టమని కోరానని కోమటిరెడ్డి అన్నారు. ముగింపు సభకు రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీని పిలుస్తారా లేదా అనేది వారి ఇష్టమన్న ఆయన.. పార్లమెంట్ సమావేశాలున్నాయి కాబట్టి శని, ఆదివారాలు తప్పకుండా తాను తప్పకుండా పాదయాత్రలో పాల్గొంటానని స్పష్టం చేశారు. ఇక పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తనను పాదయాత్రకు ఆహ్వానించలేదు.. కాబట్టి ఆ విషయంపై మాట్లాడనని కోమటిరెడ్డి చెప్పారు. ఒకవేళ ఆయన ఆహ్వానిస్తే మాత్రం తప్పకుండా వెళ్తానని స్పష్టం చేశారు.