
- డ్రామాలు ఆపండి రైతులపై ప్రేముంటే నవంబర్ 2లోపు రైతుబంధు ఇవ్వండి
- కేటీఆర్‌కు రేవంత్ సవాల్
- కాంగ్రెస్‌ను బూచీగా చూపి పథకాలకు
- నిధులు ఆపాలని కేసీఆర్ చూస్తున్నారని ఫైర్
- పార్టీ ఆదేశిస్తే కామారెడ్డిలో .. కేసీఆర్ పై పోటీకి రెడీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటన
- పాలమూరు సస్యశ్యామలమే అయితే నాపై కొడంగల్‌లో పోటీ చేయాలి
- సిరిసిల్లలో కేటీఆర్‌పై భట్టి విక్రమార్క పోటీ చేస్తరు
- నోటిఫికేషన్ లోపు స్కీమ్‌లకు నగదు బదిలీ పూర్తి చేయాలి
- ఇదే విషయాన్ని ఈసీని కోరితే.. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నది
- మేడిగడ్డనే కాదు.. కేసీఆర్ సర్కార్ కూడా కుంగిపోతదని కామెంట్
న్యూఢిల్లీ, వెలుగు: కేసీఆర్ చెప్తున్నట్లు పాలమూరును సస్యశ్యామలం చేసింది నిజమే అయితే కొడంగల్‌లో తనపై పోటీకి రావాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే కామారెడ్డిలో కేసీఆర్ పై పోటీకి తాను సిద్ధమని ప్రకటించారు. సిరిసిల్లలో కేటీఆర్ పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పోటీ చేస్తారని ఆయన చెప్పారు. కేసీఆర్‌ను, కేటీఆర్‌ను.. తాను, భట్టి ఓడిస్తామని అన్నారు. ఉమ్మడి ఏపీలో ప్రజలు ఎప్పుడూ హంగ్ కు అవకాశం ఇవ్వలేదని, తెలంగాణలోనూ హంగ్ ఎప్పుడూ రాలేదని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 2/3 మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు.
గురువారం ఢిల్లీ లోని ఏఐసీసీ ఆఫీసులో కాంగ్రెస్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం.. ఈ మూడు పార్టీలు చెడ్డీ గ్యాంగ్ లాంటివి. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తయ్. ఈ దిశలో సీట్ల పంపకాలు కూడా జరిగిపోయినయ్” అని కామెంట్స్ చేశారు. ప్రజల ప్రశ్నలకు కేసీఆర్, హరీశ్, కేటీఆర్ సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారని విమర్శించారు. ‘‘కాంగ్రెస్ ను వీడిన నాయకులు బీజేపీ సిద్ధాంతాలు నమ్మి పోలేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ.. కేసీఆర్ పై చర్యలు తీసుకుంటుందని నమ్మి ఆ పార్టీలోకి పోయిన్రు. అది అక్కడ సాధ్యం కాదని తెలిసి వెనక్కి వస్తున్నరు’’ అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ లో చేరే వారికి పార్టీ సముచిత ప్రాధాన్యం కల్పిస్తుందని తెలిపారు. జనసేనతో పాటు కేఏ పాల్ కు చెందిన ప్రజాశాంతి పార్టీని కూడా బీజేపీ చేర్చుకుంటే బాగుండేందని రేవంత్ ఎద్దేవా చేశారు. తాము ఎంఐఎంతో కలిసి వెళ్లే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
కేసీఆర్ నిధులు ఆపాలని చూస్తున్నడు
బీసీ బంధు, గృహలక్ష్మి, రైతు బంధు వంటి స్కీమ్‌ల చెల్లింపులు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపే విడుదల చేయాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే నగదు బదిలీని పూర్తి చేయాలని ఈసీకి చెప్పామని... కానీ, సంక్షేమ పథకాలు ఆపేయాలని ఫిర్యాదు చేసినట్లు బీఆర్ఎస్ తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నదని ఆయన ఫైర్ అయ్యారు. ‘‘కాంగ్రెస్ పార్టీని బూచిగా చూపి కేసీఆర్ చెల్లింపులు ఆపాలని చూస్తున్నడు. కాంగ్రెస్‌పై తప్పుడు ప్రచారం చేసినా.. బీఆర్‌ఎస్ ను ఓటమి నుంచి ఎవరూ కాపాడలేరు. ఒకవేళ కేసీఆర్ చెల్లింపులు వాయిదా వేస్తే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చెల్లిస్తుంది. ఇప్పుడు తీసుకుంటే రూ.10 వేల రైతు బంధు, రూ. 2 వేల పెన్షన్ మాత్రమే వస్తుంది. అదే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తీసుకుంటే రూ.15 వేల రైతు బంధు, రూ.4 వేల పెన్షన్ ఇస్తుంది” అని తెలిపారు. ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టేందుకు రిటైర్డ్ అధికారులను ప్రైవేటు ఆర్మీలా కేసీఆర్ వాడుకుంటున్నారని ఆయన దుయ్యబట్టారు. ‘‘నిజాం దగ్గర రజాకార్ల లాగా.. కేసీఆర్ వద్ద ఈ అధికారులు రజాకార్లలా పనిచేస్తున్నరు” అని మండిపడ్డారు.
గాల్లో మేడలా మేడిగడ్డ కట్టిన్రు
సాయిల్ టెస్ట్ వంటి జాగ్రత్తలు పాటించకుండా గాల్లో మేడలా మేడిగడ్డ బ్యారేజీని నిర్మించారని రేవంత్ విమర్శించారు. ‘‘ఈఎన్సీ మురళీధర్ రావు 12 ఏండ్ల కింద రిటైర్ అయ్యారు. కేసీఆర్‌కు, ఆయనకు ఉన్న సంబంధమేంది? దోచుకునేందుకు ఇలాంటి అధికారులను కేసీఆర్ పెట్టుకున్నడు. ఇసుక కొట్టుకుపోతే డ్యామ్ కుంగింది అంటే, ఎంత నాణ్యత లోపం ఉందో స్పష్టంగా తెలుస్తున్నది” అని అన్నారు. బీఆర్ఎస్ ను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని ఆయన ఆరోపించారు. ‘‘కేంద్రం నుంచి వచ్చిన డ్యామ్ సేఫ్టీ అధికారులు మేడిగడ్డను పరిశీలించిన తర్వాత ఇచ్చిన నివేదికను ఎందుకు బయటపెట్టడం లేదు. ఎల్ అండ్ టీ సంస్థపై ఎందుకు చర్యలు తీసుకోలేదు.. ఎందుకు బ్లాక్ లిస్ట్ లో పెట్టడం లేదు?” అని ప్రశ్నించారు. మేడిగడ్డ కాదు.. కేసీఆర్ ప్రభుత్వం కుంగిపోయే పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు.
త్వరలో సెకండ్ లిస్ట్: భట్టి
అభ్యర్థుల స్క్రీనింగ్ ముగిసిందని, కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ) భేటీలో ఆమోదం తర్వాత త్వరలో సెకండ్ లిస్ట్ విడుదల ఉంటుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు. కమ్యూనిస్ట్ పార్టీలతో చర్చలు కొనసాగతున్నాయని అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే సంక్షేమ పథకాలకు నిధులు విడుదల చేయాలని తాము డిమాండ్ చేస్తుంటే.. బీఆర్ఎస్ నేతలు మరోలా గ్లోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. ప్రగతి భవన్, ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసులను రాజకీయ కార్యక్రమాలకు వినియోగించకుండా చూడాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసినట్లు ఎంపీ ఉత్తమ్ తెలిపారు. చాలా మంది అధికారులు బీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, వారి పేర్లను ఈసీకి ఇచ్చినట్లు వెల్లడించారు.
డ్రామాలు ఆపి.. రైతుబంధు ఇవ్వండి
హైదరాబాద్, వెలుగు: రైతుబంధు విషయంలో తమపై బీఆర్ఎస్తప్పుడు ప్రచారం చేస్తోందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు గురువారం ఆయన ట్వీట్ చేశారు. ‘‘ఆడలేక మద్దెల ఓడు అంటున్నావా డ్రామారావు.. నీకు రైతులపై ప్రేముంటే నవంబర్ 2లోపు రైతుబంధు డబ్బులు ఇవ్వు. వృద్ధులపై శ్రద్ధ ఉంటే నవంబర్ 2లోపు పింఛన్ ఇవ్వు.. ఉద్యోగులపై బాధ్యత ఉంటే నవంబర్ 2లోపు అందరికీ జీతాలు ఇవ్వు.. నిన్న మేం ఎలక్షన్ కమిషన్ కు చెప్పింది ఇదే. నీలాంటి వాడిని చూసే.. నిజం చెప్పులు తొడుక్కునే లోపు, అబద్ధం ఊరంతా తిరిగొస్తుందనే సామెత పుట్టింది. డ్రామాలు ఆపి నవంబర్ 2లోపు లబ్ధిదారులకు నిధులు ఇవ్వు. లేదంటే కాంగ్రెస్ వచ్చినంక పెంచిన మొత్తంతో కలిపి ఇస్తుంది” అని ట్విట్టర్ లో పేర్కొన్నారు.