ట్రిపుల్ ఐటీ విద్యార్థుల గోడుపై సీఎంకు రేవంత్ లేఖ

ట్రిపుల్ ఐటీ విద్యార్థుల గోడుపై సీఎంకు రేవంత్ లేఖ

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు గత వారం రోజులుగా ఆందోళన చేస్తూ .. హాస్టళ్లలో జైలు లాంటి జీవితం గడుపుతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం వారి తల్లిదండ్రులను కూడా కలువనీయడం లేదన్నారు. సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు కోరుతుంటే.. కరెంటు, నీళ్లు నిలిపేయడం దారుణమని వ్యాఖ్యానించారు. ఇటువంటి చర్యలన్నీ మానవ హక్కుల ఉల్లంఘన కిందికే వస్తాయని ఆరోపించారు.  ఈమేరకు  వివరాలతో కూడిన బహిరంగ లేఖను  సోమవారం ఆయన సీఎం కేసీఆర్ కు రాశారు. ‘‘బాసర ట్రిపుల్ ఐటీ సమస్యలు తెలుసుకోవడానికి మీరు వెళ్లరు. మేం వెళ్లేందుకు బయలుదేరితే అడుగడుగునా పోలీసులను మోహరించి అరెస్టులు చేస్తారు’’ అని రేవంత్ పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలు సిల్లీ అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి హేళనగా మాట్లాడటం సరికాదన్నారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసి ఐదు రోజులవుతున్నా... ఇప్పటిదాకా ఎలాంటి పరిష్కార మార్గమూ తెరుచుకోలేదని రేవంత్ చెప్పారు.  టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్వాకం వల్లే బాసర ట్రిపుల్ ఐటీ ర్యాంకు న్యాక్ దృష్టిలో ‘సీ’ గ్రేడ్ కు పడిపోయిందన్నారు. దాదాపు 8వేల మంది విద్యార్థులు ఆందోళన చేస్తుంటే.. భోజనాలు పెట్టమని హెచ్ఓడీలు బెదిరింపులకు పాల్పడటం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. చర్చలు సఫలం అంటూ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.. సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.