
- మునుగోడు రిజల్ట్‌పై నేను హ్యాపీ
- చుక్క మందుపోయకుండా 24 వేల ఓట్లు తెచ్చుకున్నం: రేవంత్
- కాంగ్రెస్ ఓటమి.. టీఆర్ఎస్, బీజేపీ పతనానికి పునాది
- డబ్బు, మద్యం జనాన్ని ఓడించాయని కామెంట్
హైదరాబాద్, వెలుగు : మునుగోడు ఉప ఎన్నిక ఫలితంపై తాను సంతోషంగా ఉన్నానని.. చుక్క మందు పోయకుండా కాంగ్రెస్ 24 వేల ఓట్లు తెచ్చుకోవడం గర్వంగా ఉందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. అక్కడ డబ్బు, మద్యం జనాన్ని ఓడించాయని పేర్కొన్నారు. మునుగోడులో కాంగ్రెస్ ఓటమి.. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ పతనానికి పునాది అని అన్నారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఎంతో కష్టపడి పని చేశారని, వాళ్ల పోరాట పటిమను అభినందిస్తున్నానన్నారు. బుధవారం రేవంత్తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్.. పరాయి వ్యక్తులు, శక్తులపై ఆధారపడి గెలిచిందన్నారు. కమ్యూనిస్టుల సహాయంతో గెలిచిన గెలుపు ఒక గెలుపా అని ఆయన తేలిగ్గా తీసిపారేశారు. టీఆర్ఎస్ది కేవలం సాంకేతిక విజయం మాత్రమేనన్నారు. ఈ ఎన్నికతో టీఆర్ఎస్, బీజేపీ నడుమ మైత్రి మరింత బలపడిందని, ఇద్దరి బంధంపై జనాలకు కూడా ఒక స్పష్టత వచ్చిందన్నారు. ఆ రెండు పార్టీల నేతలు చిల్లర పంచాయితీలతో జనాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వారి మధ్య ఉన్నది మిత్ర బేధం తప్ప శత్రు భేదం కాదన్నారు.
మోడీ దిగజారుడు తనానికి పరాకాష్ఠ..
మునుగోడు ఫలితాన్ని చూసి ప్రధాని మోడీ కూడా కాంగ్రెస్ ఖతం అయిపోయిందని ప్రకటించడం దిగజారుడు తనానికి పరాకాష్ఠ అని రేవంత్ మర్శించారు. తమ ఓటమిని సమీక్షించుకోకుండా కాంగ్రెస్ సఫా అయిందని సంబరపడడం విడ్డూరమన్నారు. దీంతో టీఆర్ఎస్, బీజేపీ మిత్రులేనని అర్థమవుతోందన్నారు. కాంగ్రెస్‌ను ఓడించడానికి వందలాది మంది బీజేపీ నాయకులు మునుగోడులో తిష్టవేశారన్నారు. అయినా, తమకు వచ్చిన ఓట్లను చూస్తే ప్రజలకు కాంగ్రెస్‌పై ఉన్న మమకారం తగ్గలేదని అర్థమైందని రేవంత్ అన్నారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని చెప్పారు.
గవర్నర్, సర్కారు మధ్య వివాదం చిల్లర వ్యవహారం
గవర్నర్, టీఆర్ఎస్ సర్కారు నడుమ నెలకొన్న వివాదం చిల్లర వ్యవహారమని రేవంత్ పేర్కొన్నారు. గవర్నర్.. బండి సంజయ్, కిషన్ రెడ్డిల పాత్ర పోషించాల్సిన అవసరం లేదన్నారు. ఇలాంటి చర్యలతో ప్రజలు నష్టపోతున్నారన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలోని వీడియోలపై మీడియా వేసిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ.. విచారణ అధికారుల చేతుల్లో ఉండాల్సిన వీడియోలు ప్రగతి భవన్లో ఉండడంలోని మతలబు ఏమిటని ప్రశ్నించారు. 2 పార్టీల చీకటి ఒప్పందంలో భాగంగానే కేసీఆర్ ఆ వీడియోలు విడుదల చేశారన్నారు. ఇది ప్రజల్ని మభ్యపెట్టేందుకు చేసిన రాజకీయ ప్రయత్నమన్నారు.
కమ్యూనిస్టులు మైకంలో ఉన్నారు
మునుగోడులో టీఆర్ఎస్ వామపక్షాల మైత్రిపై ఆయన స్పందిస్తూ జాతీయ స్థాయిలో కమ్యూనిస్టులు తమ సహజ మిత్రులని అన్నారు. కానీ, ఇపుడు వాళ్లు ఒక మైకంలో ఉన్నారన్నారు. దాన్నుంచి బయటపడి భవిష్యత్తులో తమతో కలిసి వస్తారని భావిస్తున్నానని చెప్పారు. భారత్ జోడో యాత్రలో తెలంగాణ ప్రజలు రాహుల్‌ను అక్కున చేర్చుకున్నారని రేవంత్ అన్నారు. దేశం ప్రమాదకర పరిస్థితిలోకి నెట్టివేయబడుతున్న సమయంలో రాహుల్ ఒక భరోసాగా కనిపించారన్నారు. ఈ సందర్భం చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుందన్నారు. జోడో యాత్ర స్ఫూర్తితో మళ్లీ ప్రజల ముందుకు వస్తామని రేవంత్అన్నారు. రాష్ట్రంలో పాదయాత్ర చేసే విషయంపై సమాలోచనలు చేస్తున్నామని వివరించారు.