కేసీఆర్ హామీలను విస్మరించారు

కేసీఆర్ హామీలను విస్మరించారు

చౌటుప్పల్, వెలుగు: 2014, 2018 ఎన్నికల మేనిఫెస్టోల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా కేసీఆర్​నెరవేర్చకుండా తెలంగాణ ప్రజలను వంచించారని పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి మండిపడ్డారు. రూ. లక్ష  రుణమాఫీ చేయకుండా మునుగోడు నియోజకవర్గంలో 30 వేల మంది రైతులకు అన్యాయం చేశారని దుయ్యబట్టారు. ‘‘ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి మాట తప్పిండు. ఇంటింటికీ భగీరథ నీళ్లు ఇవ్వలేదు కానీ, గ్రామాలను చీప్ లిక్కర్  అడ్డాగా మార్చిండు” అని విమర్శించారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో రేవంత్​రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘మన మునుగోడు మన కాంగ్రెస్’ నినాదంతో మునుగోడు నియోజకవర్గంలో 100 రోజుల పాటు పర్యటిస్తామని ప్రకటించారు. తెలంగాణ ఇస్తే నల్గొండ అభివృద్ధి చెందుతుందని కాంగ్రెస్ భావించిందని, జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణం, గిరిజన భూ సమస్యల పరిష్కారం, కాలుష్యనియంత్రణ వంటి అంశాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఫెయిలయిందన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడంలో టీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని, ఈ విషయంలో బీజేపీకి కేసీఆర్  ఆదర్శ పురుషోత్తముడని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. బీజేపీ, టీఆర్ఎస్ రెండూ కలిసి ప్రతిపక్షాలను, ప్రజా సంఘాలను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. ప్రజాప్రతినిధులను అంగట్లో పశువుల్లా కొంటూ విషప్రయోగాలకు ఉప ఎన్నికలను వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

‘పాలమూరు’ ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలి

మునుగోడు నియోజకవర్గానికి వస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాలమూరు–-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదాతో పాటు డిండి ఎత్తిపోతల పథకానికి రూ.5 వేల కోట్లు ప్రకటించాలని రేవంత్​ రెడ్డి డిమాండ్ చేశారు. ‘‘హుజూరాబాద్ లో పార్టీ ఫిరాయింపులను వ్యతిరేకించిన వ్యక్తి మునుగోడులో ఫిరాయింపుల కమిటీ చైర్మన్​గా ఉన్నడు. స్థానిక ప్రజాప్రతినిధులను కొనుగోలు చేయడం ఎంతవరకు సమంజసం” అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే రాజీనామా  చేస్తేనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందనుకుంటే బీజేపీకి చెందిన  నలుగురు ఎంపీలు రాజీనామా చేయాలని, దీనివల్ల మరో 28 అసెంబ్లీ నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. ఎమ్మెల్యే రాజీనామా చేసి పార్టీ మారుతున్నట్టే.. స్థానిక ప్రజా ప్రతినిధుల చేత కూడా రాజీనామా చేయించి పార్టీలో చేర్చుకోవాలని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో కమ్యూనిస్టుల సహకారంతో మునుగోడులో గెలిచామని, పొత్తుధర్మంలో భాగంగా కాంగ్రెస్ కు ఇప్పుడు సహకరించాలని కమ్యూనిస్టులను ఆయన కోరారు. మునుగోడు బైపోల్​లో తమ పార్టీ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి ప్రచారం చేస్తానని చెప్పారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మధుయాష్కీ గౌడ్, షబ్బీర్అలీ, చిన్నా రెడ్డి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి, కుసుమ కుమార్, రాజయ్య, అద్దంకి దయాకర్, చలమల కృష్ణారెడ్డి, పల్లె రవికుమార్ గౌడ్, పున్న కైలాస్ నేత, పాల్వాయి స్రవంతి తదితరులు పాల్గొన్నారు. 

కాంగ్రెస్​ను బలహీనపర్చేందుకు కేసీఆర్​ కుట్ర

కాంగ్రెస్ ను బలహీనపరిచేందుకు కేసీఆర్​ కుట్ర చేస్తున్నారని రేవంత్​రెడ్డి ఆరోపించారు. ‘‘బీజేపీ, టీఆర్ఎస్  ఆంబోతుల్లా కొట్లాడి లేగదూడ లాంటి కాంగ్రెస్ ను తొక్కాలని చూస్తున్నయ్​” అని అన్నారు. ‘‘ఎస్ఎల్బీసీ ని కుర్చీ వేసుకుని పూర్తి చేస్తానని చెప్పిన సీఎం కేసీఆర్ ఎనిమిదేండ్లలో రెండు కిలోమీటర్లు కూడా పూర్తి చేయలేదు. రాచకొండలో దీర్ఘకాలికంగా పెండింగ్​లో ఉన్న పోడు భూ సమస్యలను పరిష్కరించాలి. కిష్టరాయన్ పల్లి, చర్లగూడెం ముంపు బాధితులకు మల్లన్నసాగర్ తరహాలో పరిహారం అందించాలి” అని డిమాండ్​ చేశారు.