వివేక్​ చేరికతో కాంగ్రెస్కు వెయ్యి ఏనుగుల బలం: రేవంత్

వివేక్​ చేరికతో కాంగ్రెస్కు  వెయ్యి ఏనుగుల బలం: రేవంత్
  • దేశానికి గాంధీ కుటుంబమెట్లనో.. తెలంగాణకు కాకా వెంకటస్వామి కుటుంబమూ అంతే
  • తాను, భట్టి విక్రమార్క అనేక సార్లు వివేక్​ను కలిసి పార్టీలోకి రావాలని కోరినట్లు వెల్లడి
  • కేసీఆర్​ను గద్దె దించేందుకు కలిసికట్టుగా పోరాడుతాం: వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్​, వెలుగు: మాజీ ఎంపీ వివేక్​ వెంకటస్వామి చేరికతో కాంగ్రెస్​ పార్టీకి వెయ్యి ఏనుగుల బలం వచ్చిందని పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి అన్నారు. ‘‘వివేక్​ చేరికతో రాష్ట్రంలో కాంగ్రెస్​ గెలుపు ఖాయమైంది. ఆయన కుటుంబం, గాంధీ ఫ్యామిలీ మధ్య మూడు తరాల బంధం ఉంది.  దేశానికి గాంధీ కుటుంబం ఎట్లనో.. తెలంగాణకు కాకా వెంకటస్వామి కుటుంబం కూడా అంత ముఖ్యం” అని తెలిపారు. రాహుల్​ సమక్షంలో వివేక్ వెంకటస్వామి, ఆయన కుమారుడు వంశీకృష్ణ  కాంగ్రెస్ లో చేరిన అనంతరం నోవాటెల్​ వద్ద వివేక్​తో కలిసి రేవంత్​ మీడియాతో మాట్లాడారు. 

రాహుల్​గాంధీ పలుమార్లు వివేక్​తో మాట్లాడి పార్టీలోకి ఆహ్వానించారని రేవంత్​ అన్నారు. ‘‘నేను, మాణిక్​రావ్​ ఠాక్రే, కేసీ వేణుగోపాల్​, భట్టి విక్రమార్క కూడా పలు మార్లు వివేక్​ను కలిసి పార్టీలోకి రావాల్సిందిగా కోరాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్​ను గద్దె దించాలంటే కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పాం. రాష్ట్రంలోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీకి మీ సహకారం ఉందని ఆయనకు విజ్ఞప్తి చేసినం. కేసీఆర్​ను గద్దె దించేది కాంగ్రెస్​ పార్టీనే అని నమ్మి పార్టీలో వివేక్​ చేరారు” అని పేర్కొన్నారు. కాంగ్రెస్​లో వివేక్ చేరిక తెలంగాణ ప్రజలకు అన్నిరకాలుగా ఉపయోగపడుతుందని, నాలుగు కోట్ల మంది ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. ‘‘ఇందిరా గాంధీ, రాజీవ్​ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్​ గాంధీ, ప్రియాంక గాంధీతో వివేక్​ వెంకటస్వామికి ఎంతో అనుబంధం ఉంది. గాంధీ కుటుంబంతో ఆయనది విడదీయలేని బంధం. ఇప్పుడు సొంత కుటుంబంలోకి వచ్చారు. ఆయనకు సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. ఆనాడు తెలంగాణ కోసం ఎంపీలంతా దేనికోసమైతే పోరాడారో.. ఆ కల తీరే సమయం ఆసన్నమైంది. వివేక్​ చేరికతో ‘మార్పు కావాలి.. కాంగ్రెస్​ రావాలి’ అన్న ఆలోచన మరింత బలపడింది” అని రేవంత్​ పేర్కొన్నారు. 

రాక్షస పాలనను అంతం చేసే దాకా ఉద్యమం: వివేక్​

కేసీఆర్​ను గద్దె దించేందుకు కలిసికట్టుగా పోరాడుతామని, రాక్షస పాలనను అంతమొందించేవరకు ఉద్యమం నడుస్తూనే ఉంటుందని వివేక్  వెంకటస్వామి  చెప్పారు. తెలంగాణ కోసం ఉద్యమం సమయంలో ఆనాడు కాంగ్రెస్​ ఎంపీలమంతా కలిసికట్టుగా కొట్లాడామని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను గుర్తించి సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. ‘‘తెలంగాణ ఏర్పడితే ప్రజలు, రాష్ట్రం బాగుపడుతుందని సోనియాగాంధీ ఆశించారు.  కానీ, ఈ తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్​ పాలనలో ఏ ఒక్కరి ఆశయాలు, ఆకాంక్షలు నెరవేరలేదు. బీఆర్​ఎస్​, కేసీఆర్​ ప్రభుత్వం కేవలం కల్వకుంట్ల కుటుంబం కోసమే పనిచేస్తున్నాయి. ప్రజల మేలు కోసం పాటుపడడం లేదు. కేసీఆర్​ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన ఎవరికీ ఏమీ చేయలేదు” అని పేర్కొన్నారు. కేసీఆర్​ను గద్దె దించడమే తమ లక్ష్యమని, కాంగ్రెస్​ పార్టీ నిర్ణయం ప్రకారమే నడుచుకుంటానని చెప్పారు.