కేసీఆర్..క్రిమినల్ పొలిటీషియన్ నియంత కన్నా దారుణం: రేవంత్

కేసీఆర్..క్రిమినల్ పొలిటీషియన్  నియంత కన్నా దారుణం: రేవంత్
  •  రైతుబంధు స్కీమ్ మాదే..2014 మేనిఫెస్టోలోనే పెట్టినం 
  • మేడిగడ్డ బ్యారేజీ మూడడుగులు కుంగింది
  • అక్కడికి అఖిలపక్షాన్ని తీసుకెళ్లడానికి కేటీఆర్ సిద్ధమా? 
  • ధరణిని రద్దు చేస్తమంటే కేసీఆర్​కు దుఃఖం ఎందుకు?
  • మీట్ ది ప్రెస్​లో పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి కోరుకున్నారని.. కానీ ఇప్పుడు తెలంగాణ సమాజం ఒక వ్యక్తి పాదాల కింద నలిగిపోతున్నదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. దాన్ని సహించేది లేదని చెప్పారు. ‘‘కేసీఆర్ పాలనలో ప్రజా సంఘాలు, అఖిలపక్ష నేతలకు ప్రాధాన్యం లేకుండా పోయింది. అసెంబ్లీ హాల్​లో కూడా ప్రతిపక్ష నేతల సీట్లు మార్చారు. మీడియాపై ఆంక్షలు పెట్టారు. సెక్రటేరియెట్ లోకి రానివ్వడం లేదు. ఉద్యమ సమయంలోనూ ఇలాంటి పరిస్థితులు లేవు. గతంలో సీఎంను ఎవరైనా కలిసేవారు. కానీ ఇప్పుడు కేసీఆర్​ను ఎవరూ కలవలేకపోతున్నారు. కేసీఆర్..​ నియంత కన్నా దారుణంగా ఉన్నారు. ఆయనో ​క్రిమినల్ పొలిటీషియన్” అని ఫైర్ అయ్యారు.

శుక్రవారం టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని బషీర్​బాగ్​ ప్రెస్​క్లబ్​లో నిర్వహించిన మీట్​ది ప్రెస్​కార్యక్రమంలో రేవంత్ మాట్లాడారు. రాష్ట్రం వచ్చి పదేండ్లవుతున్నా నీళ్లు, నిధులు, నియామకాలను సాధించుకున్నామా? అని ఆయన ప్రశ్నించారు. ‘‘మట్టికి పోయినా ఇంటోడే పోవాలంటూ కేసీఆర్​ చెప్తుంటారు. మరి ఆయన చెప్పినట్టు నీళ్లు, పల్లెలకు నిధులు వచ్చాయా? రాచరిక పోకడ కనిపించేలా చార్మినార్, కాకతీయ తోరణంతో సర్కార్ రాజముద్ర ఉన్నది. ఉద్యమ సమయంలో టీజీ అని అందరూ రాసుకుంటే, రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్ అనిపించేలా టీఎస్​గా కేసీఆర్ మార్చారు. తెలంగాణ తల్లి కూడా భుజకీర్తులతో కనిపిస్తున్నది. బహుజనులను ప్రతిబింబించడం లేదు” అని అన్నారు. 

ఐటీకి పునాది వేసిందే కాంగ్రెస్.. 

రైతుబంధు పథకం తమదేనని, కేసీఆరే దాన్ని కాపీ కొట్టారని రేవంత్ అన్నారు. ‘‘2014 ఎన్నికల మేనిఫెస్టోలోనే రైతుబంధు అంశాన్ని చేర్చాం. ఆ ఎన్నికల్లో ఓడిపోవడంతో మేనిఫెస్టోలో పెట్టిన స్కీమ్ గురించి చెప్పుకోలేకపోయాం. అధికారంలోకి వచ్చి ఉంటే కచ్చితంగా అమలు చేసేవాళ్లం” అని చెప్పారు. ‘‘తెలంగాణ గురించి మాట్లాడాలంటే 2014 జూన్​2కు ముందు, ఆ తర్వాత అని చెప్పుకోవాల్సి ఉంటుంది. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతోనే ఉద్యమం సాగింది. రాష్ట్రం కోసం వందలాది మంది బలిదానాలు చేసుకున్నారు. అది తట్టుకోలేని సోనియాగాంధీ.. పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా తెలంగాణ ఇచ్చారు. ధర్మం వైపు ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. లెక్కలు వేసుకుని స్వార్థం చూసుకుని ఉంటే వంద మంది కేసీఆర్​లు వచ్చినా తెలంగాణ వచ్చేది కాదు” అని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి చెందిందంటే దానికి కారణం కాంగ్రెస్​గతంలో అమలు చేసిన విధానాలేనని చెప్పారు. ‘‘హైదరాబాద్​లో ఐటీకి పునాది వేసిందే కాంగ్రెస్.  మళ్లీ అధికారంలోకి వచ్చాక హైదరాబాద్​ను ప్రపంచానికే తలమానికంగా మారుస్తం. మూసీని గంగా నది లెక్క చేస్తం. అర్బన్, సెమీ అర్బన్, రూరల్ తో హైదరాబాద్​కు కనెక్టివిటీ ఇస్తం. రాచకొండ గుట్టను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతం. 2050 నాటికల్లా తెలంగాణ సమగ్రాభివృద్ధికి సంబంధించిన ప్రణాళిక మా వద్ద సిద్ధంగా ఉంది” అని తెలిపారు.   

కేసీఆర్ కుటుంబం.. పెద్ద దళారీ

మేడిగడ్డ బ్యారేజీ మూడడుగుల మేర కుంగిపోయిందని రేవంత్​ చెప్పారు. ‘‘పిల్లర్​ కింద ఇసుక ఉందన్న విషయం ఇరిగేషన్​అధికారులు, ఇంజినీర్లకు తెలియదా? పిల్లర్లు కుంగాయి కాబట్టే బ్యారేజీ జాయింట్స్​లో గ్యాప్​ పెరిగింది. ఒక మీటరు కుంగిందని అధికారులే చెప్తున్నారు. తప్పించుకోవడానికే కేటీఆర్​ఏవేవో మాట్లాడుతున్నారు. కేటీఆర్.. అఖిలపక్షాన్ని మేడిగడ్డకు తీసుకెళ్దాం. అప్పుడు ప్రాజెక్టు కుంగిందో లేదో వాళ్లే చెప్తారు. అందుకు సిద్ధమా” అని సవాల్ విసిరారు. ధరణి పోర్టల్​తెచ్చి, కేసీఆర్ కుటుంబం పెద్ద దళారీగా మారిందని కామెంట్ చేశారు. ‘‘ధరణి రికార్డుల్లో మార్పులు చేయాలంటే ఆధార్​లాంటి వ్యక్తిగత వివరాలు ఇవ్వాల్సి వస్తున్నది. ధరణి నిర్వహణ మొత్తం మారిషస్​కు చెందిన కంపెనీ చేతుల్లో ఉండడంతో మన డేటా అంతా విదేశాల చేతుల్లోకి వెళ్తున్నది. మేం వచ్చాక ధరణిని రద్దు చేస్తం. దాని కన్నా మెరుగైన విధానం తెస్తం. ధరణిని రద్దు చేస్తామంటే కేసీఆర్​కు ఎందుకు దుఃఖం వస్తున్నది” అని ప్రశ్నించారు. 

మద్యం, డబ్బులు పంచకుండా పోటీకి సిద్ధమా?
 
మైనారిటీలను కాంగ్రెస్ ఏనాడూ ఓటుబ్యాంకుగా చూడలేదని రేవంత్ అన్నారు. మైనారిటీలు, జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో ఏర్పాటు చేసిన 6,540 సింగిల్​టీచర్ స్కూళ్లను కేసీఆర్ మూసేశారని మండిపడ్డారు. ‘‘కర్నాటకలో కాంగ్రెస్ ​గెలవడం నేరం, ద్రోహమని కేసీఆర్ అంటున్నారు. అంటే  బీజేపీ గెలవాలా? బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే. 2014 ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్​తో కేసీఆర్ రాజకీయంగా లబ్ధి పొందారు. 2018లో చంద్రబాబు రూపంలో అవకాశాన్ని దొరకబుచ్చుకున్నారు. కానీ, ఈ పదేండ్లలో కేసీఆర్​ గుడ్​విల్ సున్నాకు చేరింది. ఆరు గ్యారంటీలతో మేం విజయం సాధిస్తం” అని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో చుక్కామందు, డబ్బులు పంచకుండా పోటీకి సిద్ధమా? అని కేసీఆర్​కు సవాల్​ విసిరారు. 

కేటీఆర్.. గన్నేరు పప్పుకేటీఆర్​ అన్నట్టు.. నేను కందిపప్పునే

మా కొడంగల్, తాండూరులో పండే కందిపప్పు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి. ఆరోగ్యం బాగుండాలంటే కందిపప్పు, ముద్దపప్పును తినాలి. కానీ కేటీఆర్ గన్నేరు పప్పు. గన్నేరు పప్పు తింటే చచ్చిపోతారు. గన్నేరు పప్పు లాంటి కేటీఆర్​ను ఇంటికి పంపించండి.