వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు 25 సీట్లకు మించి రావు : రేవంత్ రెడ్డి

వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు 25 సీట్లకు మించి రావు : రేవంత్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రసంగం ప్రారంభంకాకముందే గద్దర్ మరణవార్త గురించి నిఘా అధికారులు చెప్పినా కేసీఆర్ పట్టించుకోలేదన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. గద్దర్ మరణవార్తను సమాజానికి తెలియజేయలేదన్నారు. గద్దర్ తో ఉన్న అనుబంధం గురించి మాట్లాడేందుకు సభలోని సభ్యులకు అవకాశం కల్పించలేదన్నారు. 

నాలుగురోజులు శాసనసభ సమావేశాలు జరిగితే సీఎం కేసీఆర్ తో పాటు మంత్రి కేటీఆర్ కూడా రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై మాట్లాడలేదన్నారు రేవంత్ రెడ్డి. భారీ వర్షాలు, వరదలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, టీఎస్ పీఎసీ పేపర్ లీకేజీపైనా చర్చించలేదన్నారు. తన చుట్టే సభలో చర్చ జరిగిందని, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకుని విమర్శలు చేశారని మండిపడ్డారు. తాను, కేసీఆర్ తెలుగుదేశం పార్టీ నుంచే వచ్చామన్నారు. తనను చంద్రబాబు నాయుడు శిష్యుడని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను చంద్రబాబు సహచరుడిగానే పార్టీలో చేరానని, తాను టీడీపీలో చేరేనాటికి ఎమ్మెల్సీనని చెప్పారు. కేసీఆర్ మాత్రం టీడీపీ నుంచే వచ్చారని, ఆయన చంద్రబాబు అనుచరుడిగా టీడీపీలో తన రాజకీయ జీవితం ప్రారంభించారని చెప్పారు.

టీడీపీలో ఉన్నా.. ఏ హోదాలో ఉన్నా.. తానెప్పుడు తెలంగాణ పట్ల తన నిబద్దత మారలేదన్నారు. తెలుగుదేశంలో కేసీఆర్ ఉన్నప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా 1996లో అసెంబ్లీలో మాట్లాడరని రేవంత్ రెడ్డి చెప్పారు. 2014లో తెలంగాణ ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో  మాట్లాడుతూ..సోనియాగాంధీ వల్లే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి. 

అవినీతి సొమ్ముతో దేశమంతా బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ విస్తరించాలనుకుంటున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీలోని తెలంగాణ పేరును ఎందుకు తొలగించారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన ఎంఐఎం పార్టీతో ఇవాళ సఖ్యతగా ఉంటున్నారంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని దూషించడానికే తెలంగాణ అసెంబ్లీని వాడుకున్నారని ఆరోపించారు. 

గద్దర్ మరణం వివాదాస్పద కావొద్దనే తాను రెండు రోజుల నుంచి మాట్లాడలేదన్నారు రేవంత్ రెడ్డి. గద్దర్ ఆకాంక్షలు, కోరికలను నెరవేరుస్తామన్నారు. తప్పని పరిస్థితుల్లోనే గద్దర్ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాల ప్రకారం నిర్వహించారని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీకి పిండం పెట్టడం.. కేసీఆర్ కు సమాధి పెట్టడం నా శపథం అంటూ మాట్లాడారు రేవంత్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 25కు మించి అసెంబ్లీ సీట్లు రావన్నారు.

https://www.youtube.com/watch?v=49V0FjkP0IE