
- రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపు ఖాయం: రేవంత్
- పార్టీలో చేరిన మాజీ మంత్రి బోడ జనార్దన్
హైదరాబాద్, వెలుగు: వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలుంటాయని, జూన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం గాంధీ భవన్‌లో మాజీ మంత్రి, బీజేపీ నేత బోడ జనార్దన్‌తో పాటు పలువురు నేతలు కాంగ్రెస్‌లో చేరారు. కేసీఆర్ మొదటి కేబినెట్‌లో ఒక్క మహిళా మంత్రి కూడా లేరని, ఉన్న దళితుడిని అర్ధాంతరంగా తొలగించారని రేవంత్ అన్నారు. తనను నమ్మి సోనియా తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించారని, రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల కోసం పోరాడుతానని చెప్పారు. పేదోళ్లకు అపోలో, యశోద లాంటి ఆస్పత్రుల్లో వైద్యం చేయించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పేదలకు ఉచిత విద్య అందించామని, ఇందిరమ్మ ఇండ్లు, రైతు రుణమాఫీ సహా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన క్రెడిట్ తమ పార్టీదేనని చెప్పారు.
బీజేపీలో గ్రూప్ రాజకీయాలు: జనార్దన్
కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నది రేవంత్ ఒక్కరేనని బోడ జనార్దన్ అన్నారు. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత ఆయన మాట్లాడారు. బీజేపీలో బీసీలకు, దళితులకు న్యాయం జరగట్లేదని, అందులో గ్రూపు రాజకీయాలు ఎక్కువని చెప్పారు. రాష్ట్రంలో అరాచకపాలన నడుస్తోందని, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు. సిర్పూర్ నియోజకవర్గ బీఎస్పీ నేత రావి శ్రీనివాస్, మెట్‌పల్లి జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, టీఆర్‌ఎస్ నేత శ్రీనివాస్ రెడ్డి, కోరుట్ల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కళ్లెం శంకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ గోపి ముత్యంరెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. కుత్బుల్లాపూర్ సెగ్మెంట్‌కు చెందిన కొలను హన్మంత రెడ్డి 500 మంది నాయకులతో ర్యాలీగా వచ్చి కాంగ్రెస్‌లో చేరారు. బీజేపీ 127వ డివిజన్ అధ్యక్షుడు పెరిక శివ, నాయకులు మొండి సాయి, జ్యోత్స్న, లాల్‌సింగ్ నాయక్, రాధ, షహనాజ్ బేగం రేవంత్ సమక్షంలో పార్టీలో చేరారు. కార్యక్రమంలో పీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు మల్లు రవి, వేం నరేందర్ రెడ్డి, కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జీ జువ్వాడి నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు.
భట్టి సమక్షంలో కాంగ్రెస్‌లోకి మంచిర్యాల నేతలు
సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క సమక్షంలో మంచిర్యాల నియోజకవర్గ టీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్‌లో చేరారు. సీఎల్పీ కార్యాలయంలో మహేశ్ పటేల్, నజీం, సాగర్, ఫిరోజ్, ఉదయ్ సాగర్ తదితరులకు భట్టి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.