తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికులది కీలక పాత్ర: రేవంత్రెడ్డి

తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికులది కీలక పాత్ర: రేవంత్రెడ్డి

తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికుల కీలక పాత్ర పోషించారని .. సకల జనుల సమ్మెలో సింగరేణి కార్మికులు భాగస్వాములు కాకపోతే తెలంగాణ వచ్చి ఉండేది కాదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.  సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కార్మికులు సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు రేవంత్ రెడ్డి. 
భూపాలపల్లిలోని సింగరేణి కార్మికులతో గేట్ మీటింగ్ లో పాల్గొన్నారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. భూపాలపల్లి 1 ఇంక్లైన్ గేట్ కార్మికులతో సమావేశం అయిన రేవంత్ రెడ్డి కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు మధుయాష్కీ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కార్యకర్తలు, సింగరేణి కార్మికులు పాల్గొన్నారు.  

సింగరేణి ప్రైవేట్ పరం చేయడంలో బీఆర్ ఎస్ పాత్ర ఉందని ఆరోపించారు రేవంత్ రెడ్డి. అరబిందో కు మైన్ అప్పగించారు.. తాడిచర్ల మైన్ ను కేసీఆర్ సంబంధీకులకు అప్పగించడం నిజం కాదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నైని కోల్ మైన్ అదానీకి కట్టబెట్టాలని చూశారని.. సింగరేణి గనులను ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకున్నది ఒక్క కాంగ్రెస్ మాత్రమే అని  అన్నారు రేవంత్ రెడ్డి. 
సింగరేణి ఎన్నికలను జరపకుండా కేసీఆర్ తప్పించుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. జెన్ కో బిల్లు కట్టి ఉంటే.. ఓపెన్ కాస్ట్ మైన్ లు ప్రైవేట్ పరం చేయకుండా ఉంటే ఎన్నికలు ఈ పాటికి జరిగేవని రేవంత్ రెడ్డి విమర్శించారు. 
డిసెంబర్ 27 సింగరేణి ఎన్నికలు జరగాలంటే.. డిసెంబర్ 3న కాంగ్రెస్ అధికారంలోకి రావాలని.. సింగరేణి కార్మికుల గుర్తించాల్సిన బాధ్యతన కాంగ్రస్ పై ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణను గుల్ల చేసిన పందికొక్కుల పనిపట్టాల్సిన బాధ్యత కాంగ్రెస్ పై ఉందన్నారు.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సింగరేణికార్మికుల సమస్యలు యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు.