- తెలంగాణ, కేరళ రాష్ట్రాలకు ఉన్న తేడాపై వివరణ
- ఇయ్యాల తిరువనంతపురంలో తేల్చుకుందాం.. చర్చకు సిద్ధమా? అని సవాల్
హైదరాబాద్, వెలుగు: కేరళ సీఎం పినరయి విజయ న్ చేసిన విమర్శలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తెలంగాణ, కేరళ రాష్ట్రాలకు ఉన్న తేడాను వివరిస్తూ విజయన్‌కు సుదీర్ఘమైన లేఖ రాశారు. రెండు రాష్ట్రాల్లో అభివృద్ధి, అక్షరాస్యత, తదితర అంశాలను పూర్తి గణాంకాలతో వివరించారు. విజ యన్ పేర్కొన్న గణాంకాలన్నీ పాతవని, గత బీఆర్ఎస్, -బీజేపీ హయాంలోని వైఫల్యాలను ఇప్పుడు తమ ప్రభుత్వానికి ఆపాదించడం హాస్యాస్పదమని కొట్టిపారేశారు.
కేరళలో దశాబ్దాల అభివృద్ధితో.. తమ 28 నెలల పాలనను పోల్చడం తగదని అన్నారు. కేరళ సాధించిన అక్షరాస్యత, ఆరోగ్యం వెనుక గత కాంగ్రెస్ సీఎంలు కరుణాకరన్, ఊమెన్ చాందీ కృషి ఉందని చురకలంటించారు. ‘‘నిజాలను తెలుసుకోవడానికి మంగళవారం తిరువనంతపురానికి వస్తున్నా, అక్కడ ముఖాముఖి చర్చకు సిద్ధమా?’’ అని పినరయి విజయన్‌కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.
తెలంగాణ ఆత్మగౌరవాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని, తమ అభివృద్ధి నమూనాను దేశవ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని రేవంత్ రెడ్డి లెక్కలతో సహా వివరించారు. రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, మహిళల కోసం ‘మహాలక్ష్మి’ స్కీమ్, 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా సన్న బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టామని, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచామని పేర్కొన్నారు.
కేవలం 28 నెలల్లోనే 67,763 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టామని, ఐటీఐలను ఏటీసీలుగా అప్‌గ్రేడ్ చేశామని తెలిపారు. హైదరాబాద్‌ను గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌గా మార్చి 1.5 లక్షల మందికి ప్రైవేటు ఉద్యోగాలు కల్పించామని, ప్రపంచ స్థాయి కంపెనీలను ఆకర్షిస్తున్నామని చెప్పారు. కేరళలో యువత ఉద్యోగాల కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్తుంటే, తెలంగాణలో మాత్రం ప్రపంచస్థాయి యూనివర్సిటీలు ఏర్పాటవుతున్నాయని రేవంత్ గర్వంగా ప్రకటించారు.
తలసరి ఆదాయంలో తెలంగాణ టాప్
10.1శాతం జీఎస్‌డీపీ వృద్ధి రేటుతో, రూ. 3.79 లక్షల తలసరి ఆదాయంతో దేశంలోనే తెలంగాణ పెద్ద రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఉందని సీఎం రేవంత్ గుర్తు చేశారు. కేరళ సీఎం కార్యాలయం చుట్టూ తిరిగిన 30 కేజీల గోల్డ్ స్మగ్లింగ్ కేసును, శబరిమల ఆలయ బంగారం తాపడం స్కామ్‌ను ప్రస్తావిస్తూ విజయన్ సర్కార్ అవినీతిని రేవంత్ ప్రశ్నించారు. కేరళలో ఐఏఎస్ అధికారులే జైలుకు వెళ్లిన ఉదంతాలను గుర్తు చేశారు.
ఇందుకు విరుద్ధంగా తెలంగాణలో సామాజిక న్యాయం కోసం కుల గణనను చేపట్టి 41శాతం ఓబీసీ రిజర్వేషన్లకు బాటలు వేశామని, ఎస్సీ వర్గీకరణ కోసం కమిటీ వేశామని తెలిపారు. ట్రాన్స్‌జెండర్లకు ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశం కల్పించి దేశానికే ఆదర్శంగా నిలిచామని, గిగ్ వర్కర్ల చట్టం తెచ్చామని రేవంత్ వివరించారు. ముసీ పునరుజ్జీవం, రీజనల్ రింగ్ రోడ్ (ట్రిపుల్ ఆర్), మెట్రో విస్తరణలాంటి మెగా ప్రాజెక్టుల వివరాలను లేఖలో పొందుపరిచారు.
నేడు తిరువనంతపురంలో ప్రచారం
సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం కేరళ రాజధాని తిరువనంతపురంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇందుకోసం ఆయన సోమవారం రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరి తిరువనంతపురం చేరుకున్నారు. కేరళలో ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. దీంతో ప్రచారం ముగింపు రోజున సీఎం రేవంత్ అక్కడ పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో యూడీఎఫ్ ఏర్పాటు చేసే రోడ్ షోలు, సభల్లో పాల్గొననున్నారు. అనంతరం మంగళవారం రాత్రి తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. ఇప్పటికే ఒక విడిత ప్రచారాన్ని సీఎం రేవంత్ ఆ రాష్ట్రంలో నిర్వహించారు.
