ప్రభుత్వాలు మారినా పారిశ్రామిక పాలసీలు మార్చలె : రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి

ప్రభుత్వాలు మారినా పారిశ్రామిక పాలసీలు మార్చలె : రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి
  • హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నం: రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి
  • డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్​రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తామని వెల్లడి
  • మహేశ్వరంలో మలబార్ జెమ్స్ అండ్ జ్యువెలరీ తయారీ యూనిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రారంభం 

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో మలబార్ జెమ్స్ అండ్ జ్యువెలరీ తయారీ యూనిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. మహేశ్వరంలో మలబార్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్- 2047 విజన్ డాక్యుమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆవిష్కరించబోతున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. 

రాబోయే వందేండ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ విజన్ డాక్యుమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రూపొందిస్తున్నామని చెప్పారు. మహేశ్వరంలో ఫోర్త్ సిటీ.. భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించబోతున్నామని, ఇది రాష్ట్ర అభివృద్ధిలో కీలక ఘట్టం కానుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాలు మారినా మన పారిశ్రామిక పాలసీలు మార్చలేదని ఆయన గుర్తుచేశారు. 

పెట్టుబడులకు మెరుగైన అవకాశాలు కల్పిస్తూ ముందుకెళ్తున్నామన్నారు. పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పెట్టుబడిదారులకు లాభాలు చేకూరేలా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వంపై నమ్మకం ఉంచి ఇక్కడ యూనిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేసిన మలబార్ గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నకు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.