70వ దశకంలోనే పల్లెలకు కరెంట్ తీసుకొచ్చిండు

70వ దశకంలోనే పల్లెలకు కరెంట్ తీసుకొచ్చిండు

హైదరాబాద్కు మెట్రో రైల్ను మంజూరు చేయించిన ఘనత కేంద్రమాజీ మంత్రి, దివంగత నేత జైపాల్ రెడ్డిదే అని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. మెట్రోరైల్కు జైపాల్ రెడ్డి పేరు పెట్టా్ల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రంగారెడ్డి జిల్లా మాడ్గులలో కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్ రెడ్డి విగ్రహాన్ని CPM జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరితో కలిసి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో మచ్చలేని నాయకుడిగా జైపాల్ రెడ్డి కొనసాగారన్నారు. పీవీ విగ్రహంలాగే నెక్లేస్ రోడ్లో జైపాల్ రెడ్డి విగ్రహం ఏర్పాటవుతుందని చెప్పారు. 

అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు.
కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు నీరివ్వాలని మొట్టమొదట ముందు నిలిచింది జైపాల్ రెడ్డి అని రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీకి వెళ్లినా కూడా జైపాల్ రెడ్డి  ఈ ప్రాంత సమస్యల విషయంలో రాజీ పడలేదని చెప్పారు. 70వ  దశకంలోనే మారుమూల పల్లెలకు కరెంటును తీసుకొచ్చి వెలుగులు నింపిన వ్యక్తి జైపాల్ రెడ్డి అని కొనియాడారు. ఎవరినీ విమర్శించకుండా రాజకీయాలు చేయడం అసాధ్యమన్న రేవంత్ రెడ్డి....అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత జైపాల్ రెడ్డి దే అని చెప్పారు. తాము జైపాల్ రెడ్డి రాజకీయ వారసులమని....ఆయన బంధువులమని తెలిపారు. పార్టీలకు అతీతంగా జైపాల్ రెడ్డి రాజకీయ వారసులు ఉన్నారని వెల్లడించారు. ఆయన ఎంతో మంది నాయకులను తయారు చేశారని చెప్పారు.