- లండన్‌లో ప్రవాస తెలుగు ప్రతినిధులతో సీఎం రేవంత్ ముఖాముఖి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణ రైజింగ్’ సంకల్పాన్ని, అభివృద్ధి లక్ష్యాలను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. లండన్ పర్యటనలో భాగంగా ఆదివారం సెంట్రల్ లండన్‌లోని తాజ్ హోటల్‌లో ప్రవాస భారతీయులు, తెలుగు కమ్యూనిటీ ప్రతినిధులతో నిర్వహించిన ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి పాల్గొన్న ఈ సమావేశాన్ని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, టీపీసీసీ ఎన్నారై కన్వీనర్ సుధాకర్ గౌడ్ నిర్వహించారు.
బ్రిటన్‌లోని వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, నిపుణులు, ఎన్నారైలు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఈ వేదికపై సీఎం ప్రవాసులతో ఆత్మీయంగా ముచ్చటించారు. ప్రపంచ ఆర్థిక, ఆవిష్కరణల శక్తి కేంద్రంగా తెలంగాణను నిలబెట్టడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని, ఈ ప్రగతి ప్రస్థానంలో ప్రవాస బిడ్డలు రాష్ట్రానికి తిరుగులేని రాయబారులుగా, క్రియాశీలక భాగస్వాములుగా నిలవాలని కోరారు. రాష్ట్ర సమగ్ర ప్రగతిలో ప్రవాసుల అంతర్జాతీయ అనుభవం, ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు, పెట్టుబడులు ఎంతో కీలకమని స్పష్టం చేశారు.
సరికొత్త అవకాశాల సృష్టికి అందరూ ఏకం కావాలని సీఎం ఆకాంక్షించారు. యూకే, యూరప్ దేశాల్లోని అంతర్జాతీయ సంస్థలు, ప్రవాస పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అత్యంత అనుకూలమైన పారిశ్రామిక వాతావరణం, పారదర్శక విధానాలను ప్రభుత్వం అందిస్తుందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్ర విద్యారంగాన్ని పటిష్టం చేయడం, గ్లోబల్ నాలెడ్జ్ షేరింగ్‌ను తెలంగాణ విద్యా వ్యవస్థకు అనుసంధానించడంపై సదస్సులో విస్తృతంగా చర్చించారు. ప్రవాస సమాజంతో ప్రభుత్వ అనుసంధానాన్ని మరింత బలోపేతం చేసే దిశగా నిపుణుల సలహాలు, సూచనలను సీఎం స్వీకరించారు. సంపద సృష్టితో పాటు నవ తెలంగాణ నిర్మాణంలో ఎన్నారైలు బలమైన చోదక శక్తిగా మారి, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కార్యాచరణ రూపొందించుకోవాలని సీఎం పేర్కొన్నారు.
