రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఈ ఎనిమిదేళ్లలో రాష్ట్రంలో 8500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. కామారెడ్డి మండలం నర్సన్నపల్లి పరిధిలో వర్షాలకు నష్టపోయిన పంటలను పరిశీలించారు రేవంత్ రెడ్డి. తడిసిన ధాన్యానికి రైతులకు ఎకరాకు రూ.20 వేల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మామిడి తోట రైతులకు రూ. 50 వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలన్నారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నాయకులు రైతులను పరామర్శించాల్సింది పోయి.. తాగుడు కోసం, దావత్ ల కోసం ఆత్మీయ సమ్మేళనాలు చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు రేవంత్. 18 మంది సన్యాసి మంత్రులు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రైతులు కన్నీరుమున్నీరుగా ఏడుస్తుంటే రాజకీయ సభల పేరుతో ఊరేగుతున్నారని విమర్శించారు.
రైతుల ఓట్లతో గెలిచిన కేసీఆర్ రైతుల గుండెల మీద తన్నుతున్నారని విమర్శించారు. పండించిన పంట కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని అన్నారు. రెండు లక్షల మంది రైతుల ఆత్మహత్యలకు కారణం కేసీఆరేనని.. కేసీఆర్ రైతుల హంతకుడని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం రైతులకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యానికి 2 వేల రూపాయలు ఇవ్వాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక ఐఏఎస్ అధికారి చేత పంటలను పరిశీలించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలన్నారు.