కాళేశ్వరంతో కేసీఆర్ పాపం పండింది : రేవంత్

కాళేశ్వరంతో కేసీఆర్ పాపం పండింది : రేవంత్
  •     ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్లు దోచుకుండు : రేవంత్
  •     ఉచిత కరెంట్ ​కాంగ్రెస్​ పేటెంట్​ హక్కు
  •     వ్యవసాయానికి ఐదు గంటల కరెంటే ఇస్తామని ఎక్కడ చెప్పినం?
  •     మీరు 24 గంటల కరెంటు ఇస్తున్నట్లు రుజువు చేస్తే నామినేషన్లు వేయం 
  •     ఇస్తలేరని మేము నిరూపిస్తే నడిగడ్డలో ముక్కు నేలకు రాస్తరా?
  •     అధికారంలోకి రాగానే ధరణి స్థానంలో కొత్త యాప్ ​తెస్తం
  •     మూడోసారి అధికారం అడిగితే ప్రజలు మూతిపళ్లు రాలగొడతరు
  •     ఉమ్మడి మహబూబ్ నగర్​ జిల్లా సభల్లో కేసీఆర్​పై పీసీసీ చీఫ్​ ఫైర్​

మహబూబ్​నగర్​/గద్వాల/మక్తల్, వెలుగు :  కాళేశ్వరం ప్రాజెక్టుతోనే కేసీఆర్ పాపం పండిందని పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి అన్నారు. ‘‘కాళేశ్వరం ద్వారా కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తామని కట్టిన మేడిగడ్డ కుంగిపోయింది.  అన్నారం పగిలిపోయింది. సుందిళ్ల రేపో, ఎల్లుండో కుప్పకూలేటట్లుంది. నీ అవినీతికి దేవుడిని కూడా వదల్లేదు. శివుడి మీద ఒట్టేసి ప్రాజెక్టు కట్టినవ్. దేవుడి పేరుతో లక్ష కోట్లు తిన్నవ్.  గుడిని, గుడిలో లింగాన్ని మింగేటోన్ని ఇప్పుడే చూస్తున్న’’ అని కేసీఆర్​పై మండిపడ్డారు. ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలోని శాంతినగర్, గద్వాల, మక్తల్​లో మంగళవారం నిర్వహించిన సభల్లో ఆయన మాట్లాడారు. 

అంతకుముందు అలంపూర్​లోని  జోగులాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.  ‘‘ఐదు గంటలు, మూడు గంటల కరెంటు అని నేను ఎక్కడన్నా? నీకు చీము, నెత్తురు ఉంటే కాంగ్రెస్ ​పార్టీ ఈ మాట ఎక్కడన్నదో నిరూపించు. అగ్రికల్చర్​కు ఫ్రీ కరెంటు, రైతుల మీద పెట్టిన అక్రమ కేసులు తొలగించింది కాంగ్రెస్​పార్టీనే. రూ.1,200 కోట్ల విద్యుత్​ బకాయిలు మాఫీ చేసింది కాంగ్రెస్సే. ఉచిత కరెంట్ ​కాంగ్రెస్ ​పెటెంట్​హక్కు. నడిగడ్డ, మక్తల్​లో ఏ విద్యుత్​సబ్ ​స్టేషన్​కు అయినా పోదాం. లాగ్ ​బుక్కులను పరిశీలిద్దాం. మీరు 24 గంటల కరెంటు ఇస్తున్నట్లు రుజువైతే నేను నా క్యాండిడేట్లు నామినేషన్లు వేయం. ఇక్కడి నుంచి ఇండ్లకు వెళ్లిపోతం. 24 విద్యుత్​ ఇవ్వడం లేదని నిరూపిస్తే నడిగడ్డలో కేసీఆర్ ​ముక్కు నేలకు రాసి, రైతులకు క్షమాపణ చెప్పాలి’’ అని రేవంత్ సవాల్ విసిరారు.  

బెల్టు షాపుల తెలంగాణ చేసిండు

‘‘రెండుసార్లు గెలిపిస్తే లక్ష కోట్లు సంపాదించుకున్నావ్. మూడోసారి నీకు అధికారం ఇస్తే కృష్ణానదిలో కలిపేస్తవ్. పది వేల ఎకరాలు దోచుకున్నావ్. మీ ఇంట్లో నాలుగు పదవులు తీసుకున్నావ్. మూడోసారి ఇస్తే నీ మనువడిని కూడా పదవి ఇస్తవు. పదేండ్ల నీ పాలనలో పేదలకు డబుల్​బెడ్​ రూమ్ ​ఇండ్లు ఇచ్చినవా? దళితులకు మూడెకరాల భూమి పంచినవా? లక్ష ఎకరాలకు సాగునీరు అందించావా?  కేజీ టు పీజీ ఉచిత విద్య ఏమైంది? వంద పడకల ఆస్పత్రి ఏడికి పాయే?’’ అని రేవంత్​ కేసీఆర్​ను ప్రశ్నించారు. మూడోసారి అధికారం అడిగితే ప్రజలు మూతిపళ్లు రాలగొడతారన్నారు.

కాంగ్రెస్​ హయాంలోనే  నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాల, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్​సాగర్, శ్రీరామ్​సాగర్, దమ్ముగూడెం, రాజీవ్​సాగర్, ఇందిరా సాగర్, హైటెక్​ సిటీ, ఔటర్​రింగ్​ రోడ్డు, ఇంటర్నేషనల్​ఎయిర్​పోర్ట్, మెట్రో సర్వీసులు వచ్చాయని గుర్తు చేశారు. కేసీఆర్​కు రెండు సార్లు అధికారం ఇస్తే1,800 బార్​షాపులు,62 వేల బెల్టులు షాపులు, 3 వేల వైన్​ షాపులు వచ్చాయన్నారు. బంగారు తెలంగాణ కాదు బెల్టు షాపుల తెలంగాణగా మార్చి, తాగుబోతులను తయారు చేశారని మండిపడ్డారు.  

 ధరణి ఏటీఎంలా మారింది

‘‘ధరణిని రద్దు చేస్తే రైతుబంధు పోతదంట. రైతుబంధు 2018లో మొదలు పెడితే ధరణి పోర్టల్ 2020లో ప్రారంభించారు.    కాంగ్రెస్ ​రైతులకు రుణమాఫీ చేసింది. వ్యవసాయ పనిముట్లు, సబ్సిడీ ఎరువులు, విత్తనాలు ఇచ్చింది. ధరణి పేరుతో దోపిడీ చేస్తున్నవ్. ఆ పోర్టల్ నీకు ఏటీఎంలా మారింది. ఈ పోర్టల్​ను రద్దు చేస్తే దళారులు వస్తరంటున్నవ్​? నీ కుటుంబమే ఒక దళారీ. రాష్ర్టాన్ని దోచుకుంటున్నారు. కాంగ్రెస్ ​అధికారంలోకి రాగానే ‘ధరణి’ స్థానంలో కొత్త యాప్​ తెస్తాం’ అని రేవంత్​ అన్నారు. మక్తల్​లో ఇసుక  రవాణా, భూ ఆక్రమణల్లో స్థానిక ఎమ్మెల్యే ప్రమేయం ఉందని ఆరోపించారు. సమస్యల మీద ప్రజలు ఎమ్మెల్యే ఇంటికెళ్తే.. గన్​మెన్​లతో మెడలు పట్టి గెంటిస్తున్నాడని ఫైర్​అయ్యారు.

చల్లా వెంకట్రామిరెడ్డి తాత నీలం సంజీవరెడ్డిని రాష్ర్టపతిని చేసింది కాంగ్రెస్​ పార్టీయే అని గుర్తు చేశారు. వెంకట్రామిరెడ్డి ప్రతిష్ట ఏమైందని, ఎమ్మెల్సీ పదవి కోసం తలవంచి దొర గడీలో ఆత్మగౌరవాన్ని ఎందుకు తాకట్టు పెట్టావో సమాధానం చెప్పాలన్నారు. నా ఇంటి గేట్లు ఎప్పుడు తెరిచే ఉంటాయని, రాహుల్, సోనియా ఎవరినీ కలువాలఋన్నా సాధ్యపడుతుందన్నారు. ఇది పాలమూరు ప్రజలు జీవన్మరణ సమస్య అని, కేసీఆర్, హరీశ్​రావు, కేటీఆర్​లు గొడ్డలి, కొడవళ్లు తీసుకొచ్చి ఓడించాలనే కుట్రలు చేస్తున్నారన్నారు.

పాలమూరు బిడ్డలంతా ఏకం కావాలని, ఉమ్మడి జిల్లాలోని14  అసెంబ్లీ స్థానాలను గెలిపించాలని కోరారు.  మీటింగుల్లో కొల్లాపూర్​, వనపర్తి, అలంపూర్​, గద్వాల, మక్తల్​ కాంగ్రెస్​అభ్యర్థులు జూపల్లి కృష్ణారావు, మేఘారెడ్డి, సంపత్​కుమార్, సరిత, వాటికి శ్రీహరి, పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్​రెడ్డి, బండ్ల చంద్రశేఖర్​రెడ్డి, ప్రశాంత్​రెడ్డి, సిద్ధార్థ్​రెడ్డి, నాగరాజుగౌడ్​ తదితరులు పాల్గొన్నారు.

బోయలు, ముదిరాజ్​లకు మోసం​

బోయలకు ఎమ్మెల్సీ ఇస్తామని, ఎస్టీ జాబితాలో చేర్చుతామని చెప్పి కేసీఆర్​మోసం చేసిండని రేవంత్ విమర్శించారు.   సరితకు టికెట్​ ఇవ్వడం వల్ల బోయలకు టికెట్​ ఇవ్వలేకపోయామని, ఆమెను గెలిపిస్తే బోయలను ఎమ్మెల్సీ చేస్తామన్నారు. బోయలను ఎస్టీ జాబితాలో చేర్చే బాధ్యతను తాను తీసుకుంటానన్నారు. రాష్ట్రంలో 11% ఉన్న ముదిరాజ్​లకు బీఆర్ఎస్​ ఒక్క టికెట్ ​కూడా ఇవ్వలేదన్నారు.

కాంగ్రెస్ ముదిరాజ్​లకు అవకాశాలు కల్పిస్తోందన్నారు. తుమ్మిళ్లను పూర్తి చేస్తామని 2014లో కేసీఆర్​ మాట ఇచ్చి చేయలేదన్నారు, కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే ఆర్డీఎస్​ పంచాయితీ తెంచుతామన్నారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా  అలంపూర్ ​ఆలయ అభివృద్ధికి వంద కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చి కేసీఆర్ ​మోసం చేశారని ఫైర్​ అయ్యారు.