వివేక్.. అప్పుడు రాముడు ఇప్పుడు రావణుడా? : రేవంత్​రెడ్డి

వివేక్.. అప్పుడు రాముడు ఇప్పుడు రావణుడా? : రేవంత్​రెడ్డి
  • ఐటీ, ఈడీ దాడుల వెనుక బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర: రేవంత్
  • ఏకే గోయల్ ఇంట్లో రూ.300 కోట్లు దొరికినా, ఎందుకు బయటపెట్టలె?
  • కేసీఆర్ అవినీతిపై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకుంటలె? 
  • మోదీ జేసీబీలు పెట్టి లేపినా బీఆర్ఎస్ లేవదని కామెంట్ 

హైదరాబాద్, వెలుగు: ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీతో తమకు పోటీ కాదని.. ఈడీ, ఐటీతోనే తమకు పోటీ అని పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి అన్నారు. ‘‘ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్​ల మధ్య ఉన్న ఫెవికాల్​బంధం మరోసారి బయటపడింది. ఐటీ, ఈడీ కేవలం కాంగ్రెస్​నేతల మీదనే పని చేస్తాయా? వివేక్​వెంకటస్వామి, పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి లాంటి నేతల ఇండ్లపై చేసిన దాడులే ఇందుకు నిదర్శనం” అని మండిపడ్డారు. శనివారం హైదరాబాద్ జూబ్లీహిల్స్​లోని తన ఇంట్లో మీడియాతో రేవంత్ మాట్లాడారు. 

‘‘బీజేపీలో ఉన్నన్ని రోజులు వివేక్ ను రాముడిలాగా చూసినోళ్లు.. ఇప్పుడు ఆయన కాంగ్రెస్​లో చేరగానే రావణాసురుడిగా చూపిస్తున్నారు. కేసీఆర్​ అవినీతిపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతోనే వివేక్ బీజేపీని వీడారు. పార్టీ వీడినందుకు ఆయన్ను అంతర్జాతీయ ఆర్థిక ఉగ్రవాదిగా చిత్రీకరించేందుకు బీజేపీ, బీఆర్ఎస్​కుట్ర పన్నాయి” అని ఫైర్ అయ్యారు. ‘‘పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బంధువైన పాపానికి రఘురామ్​రెడ్డిపై అక్రమ కేసులు పెట్టారు. 

రామసహాయం సురేందర్​రెడ్డిని ఇప్పటి వరకు వేలెత్తి చూపించినోళ్లు లేరు. కానీ ఇప్పుడు బంధుత్వం కూడా బీఆర్ఎస్​దృష్టిలో నేరంగా కనిపిస్తున్నది. ఒప్పందంలో భాగంగానే బీజేపీ, బీఆర్ఎస్​కలిసి వారిని టార్గెట్​చేశాయి” అని మండిపడ్డారు. ‘‘మాజీ ఐఏఎస్​ఏకే గోయల్​ఇంట్లో చేసిన తనిఖీల్లో రూ.300 కోట్లు దొరికి నా బయటకు చూపించలేదు. రివర్స్​లో కాంగ్రెస్​నేతలపైనే లాఠీచార్జ్ చేశారు. గోయల్ రూ.వెయ్యి కో ట్లు పంపిణీ చేశారని మేం​ఫిర్యాదు చేసినా ఎన్నికల సంఘం పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధి కారి వికాస్​రాజ్​కు ఫోన్​చేస్తే కనీసం ఎత్తడం లేదు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం.. కేసీఆర్​అవినీతిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. 

రైతుబంధు పడ్డదని రైతులు ప్రభావితం కావొద్దు.. 

రైతుబంధుకు ఈసీ అనుమతి ఇవ్వడం చూస్తుంటే బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఒప్పందం కుదిరిందని అర్థమవుతోందని రేవంత్​అన్నారు. రైతుబంధు డబ్బులు పడ్డాయని రైతులు ప్రభావితం కావొద్దని సూచించారు. తాము అధికారంలోకి వస్తే ఇంకో రూ.5 వేలు ఎక్కువే వస్తాయని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం ఏమిచ్చినా తీసుకోవాలని, తాము అధికారంలోకి వచ్చాక మిగతావి ఇస్తామని తెలిపారు. ‘‘2018 జూన్​లో రైతుబంధు పథకాన్ని ప్రారంభించారు. 

అప్పట్లో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో షెడ్యూల్​వచ్చిన వెంటనే రైతుబంధు నిధులను విడుదల చేశారు. ప్రజల సొమ్ముతో ఎన్నికలను కేసీఆర్​ప్రభావితం చేశారని ఆనాడు విశ్లేషకులు చెప్పారు. ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో నవంబర్​ 15లోగా రైతుబంధు వేసేలా బీఆర్ఎస్ సర్కార్ కు ఆదేశాలివ్వాలని కేంద్రానికి, ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశాం. ప్రభుత్వ పథకాన్ని దుర్వినియోగం చేయకుండా చూడాలని కోరాం. కానీ పోలింగ్​కు నాలుగు రోజులే ఉందనగా రైతుబంధు విడుదలకు ఈసీ గ్రీన్​సిగ్నల్​ఇచ్చింది. ఈ విషయంలో బీఆర్ఎస్​కు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించింది.  ప్రభుత్వ సొమ్ముతో ఓట్లు కొనాలని కేసీఆర్​చూస్తున్నారు. 2018లో చేసినట్టే ఇప్పుడూ చేస్తున్నారు’’ అని మండిపడ్డారు. 

ఓట్లను బీఆర్ఎస్ కొంటున్నది.. 

ఎన్ని కుట్రలు చేసినా, మోదీ జేసీబీలు పెట్టి లేపినా బీఆర్ఎస్​ లేవదని.. ఆ పార్టీకి ఓటమి తప్పదని రేవంత్​ అన్నారు. ‘‘రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనించాలి. బీఆర్ఎస్, బీజేపీ ప్రసంగాలకు.. జరుగుతున్న తతంగాలకు అసలు పొంతనే లేదు. కాంగ్రెస్​గెలుస్తుందన్న చర్చల నేపథ్యంలోనే బీఆర్ఎస్, బీజేపీ కలిసి ఇన్ని కుట్రలకు తెరలేపుతున్నాయి. డబ్బు సంచులతో ఎన్నికల్లో గెలిచేందుకు కేసీఆర్​ప్రయత్నిస్తున్నారు. ఓటుకు రూ.10 వేలు ఇచ్చి గెలవాలనుకుంటున్నారు. ఇప్పటికే నగదు బదిలీ పథకం మొదలైంది. బీఆర్ఎస్​ ఓట్ల కొనుగోలుకు బీజేపీ పూర్తిగా సహకరిస్తున్నది” అని మండిపడ్డారు.