
- మీర్ఖాన్పేటలో ఎఫ్‌సీడీఏ భవనానికి పునాది రాయి వేయనున్న సీఎం రేవంత్
- రావిర్యాల నుంచి ఆమనగల్ దాకా గ్రీన్‌ఫీల్డ్
- రేడియల్ రోడ్ –1 నిర్మాణానికీ భూమిపూజ
- మొత్తం 30 వేల ఎకరాల విస్తీర్ణంలో సిటీ..
- ఇందులో 15 వేల ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్‌తో గ్రీన్ లంగ్స్
- ‘నెట్-జీరో స్మార్ట్ సిటీ’గా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక
హైదరాబాద్, వెలుగు: భారత్ ఫ్యూచర్ సిటీకి సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం ఉదయం అంకురార్పణ చేయనున్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూర్ మండలం మీర్ఖాన్పేటలో ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ(ఎఫ్‌సీడీఏ) భవన నిర్మాణానికి పునాదిరాయి వేయనున్నారు. ఫ్యూచర్ సిటీ పరిధిలోని మీర్ఖాన్పేటలో 7.29 ఎకరాల స్థలాన్ని ఎఫ్సీడీఏకు కేటాయించారు. అందులో 2.11 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఎఫ్‌సీడీఏ భవనానికి, రావిర్యాల నుంచి ఆమనగల్ వరకు నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్–1 నిర్మాణానికి సీఎం భూమి పూజ చేయనున్నారు. హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి ప్రమాణాలతో ‘భారత్ ఫ్యూచర్ సిటీ’కి ప్రభుత్వం ప్రణాళికలు రెడీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మహా నగరంలో పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్, కాలుష్య నియంత్రణకు వీలుగా దీన్ని అభివృద్ధి చేయనుంది.
ఇందులో భాగంగా ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తున్నది. మొత్తం 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దాదాపు 30 వేల ఎకరాల్లో ఈ అధునాతన సిటీ నిర్మించనుంది. 3 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 7 మండలాలు, 56 రెవెన్యూ గ్రామాల పరిధిలో ఈ సిటీ విస్తరించనుంది. మహానగరానికి పెరుగుతున్న వలసలు, అభివృద్ధికి తగ్గట్టు సమతుల్య ప్రాంతీయ అభివృద్ధిని ప్రోత్సహించేందుకు ఫ్యూచర్ సిటీ కీలకంగా మారనుందని ప్రభుత్వం చెప్తున్నది.
ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో సరికొత్త ఆర్థిక, సామాజిక కేంద్రంగా ఈ సిటీని అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. సుస్థిర పట్టణాభివృద్ధికి ప్రపంచ నమూనాగా దీన్ని రూపొందించేందుకు అభివృద్ధి ప్రణాళికలు కూడా రెడీ అయ్యాయి. ప్రపంచ బ్యాంకు, జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ వంటి అంతర్జాతీయ సంస్థలు ఈ సిటీ అభివృద్ధిలో భాగస్వాములవుతున్నాయి.
‘లైవ్, లెర్న్, వర్క్, ప్లే’ కాన్సెప్ట్తో..!
దేశంలో మొట్టమొదటి ‘నెట్-జీరో స్మార్ట్ సిటీ’గా ఫ్యూచర్‌సిటీని తీర్చిదిద్దుతున్నారు. 15 వేల ఎకరాల సిటీ ఏరియాతో పాటు దానికి అనుకొని 15 వేల ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ ఉండడంతో గ్రీన్ లంగ్స్‌గా పని చేయనుంది. స్పాంజ్ పార్కులు, అర్బన్ ఫారెస్ట్ లతో పాటు వాటర్ రీసైక్లింగ్, జీరో- డిశ్చార్జ్ వంటి పర్యావరణహిత నగరంగా ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తున్నది. ‘లైవ్, లెర్న్, వర్క్, ప్లే’ కాన్సెప్ట్ తో ఈ సిటీ అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ పరిశ్రమలతో పాటు స్కూళ్లు, హాస్పిటళ్లు, పార్కులు, షాపింగ్ సెంటర్లు అన్నీ ఒకే ఇంటిగ్రేటెడ్ జోన్‌లో ఉంటాయి.
ఫార్మాతో పాటు హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్బేస్డ్ పరిశ్రమలు, ఎంటర్టైన్మెంట్ ఎకో టూరిజం జోన్లుగా ఈ సిటీని విభజించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీలు), ఎలక్ట్రానిక్స్ రంగాలకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో రాబోయే శతాబ్దపు సిటీకి సంకేతమని అధికారులు చెప్తున్నారు. స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నెక్స్ట్-జనరేషన్ టెక్నాలజీకి ఫ్యూచర్ సిటీ సరికొత్త నమూనాగా మారనుందని అంటున్నారు.
సింగిల్ విండో క్లియరెన్స్
ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో భాగంగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఆలస్యం కాకుండా ప్రభుత్వం ‘సింగిల్ విండో సిస్టమ్’ అమలు చేయనుంది. ఎఫ్‌సీడీఏ కార్యాలయంలోనే భవన నిర్మాణం, లే అవుట్లు, పారిశ్రామిక అనుమతులు వంటి అన్ని రకాల క్లియరెన్స్‌లు ఒకేచోట లభిస్తాయి. సుపరిపాలన దిశగా ఇది సరికొత్త మార్పు అని.. ప్రపంచంలో పేరొందిన కంపెనీలు, పరిశ్రమలు ఇక్కడ పెట్టుబడులకు తరలివస్తాయని ప్రభుత్వం పేర్కొంటున్నది.
ట్రాఫిక్ జామ్‌లకు చెక్ పెట్టేలా సూపర్-ఫాస్ట్ కనెక్టివిటీ ఉంటుంది. మహానగరాలకు అత్యంత ముఖ్యమైనది ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ. ఈ దిశగా భారత్ ఫ్యూచర్ సిటీలో అధునాతన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్), రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్)ను కలుపుతూ వంద మీటర్ల వెడల్పుతో గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్లను ప్రభుత్వం నిర్మించనుంది. రావిర్యాల నుంచి అమనగల్ వరకు 41.5 కిలోమీటర్ల రేడియల్ రోడ్ నెం.1కు సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేయనున్నారు.
రేడియల్ రోడ్లతో పాటు శ్రీశైలం, నాగార్జున సాగర్ హైవేలను కలిపే కొత్త ఈస్ట్-వెస్ట్ ట్రంక్ రోడ్డు నిర్మిస్తారు. టోల్ ఫీజు లేకుండా వేగవంతమైన ప్రయాణానికి సింగిల్-ఫ్లో మార్గాలను ప్లాన్ చేస్తున్నారు. వీటితో పాటు మెట్రో ఫేజ్ 2–బీకి అనుసంధానం చేయనున్నారు.