స్థానికులు, చిరువ్యాపారుల సమస్యలను తెలుసుకున్న రేవంత్ రెడ్డి

స్థానికులు, చిరువ్యాపారుల సమస్యలను తెలుసుకున్న రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వంలో మార్పిడి, పాలనలో మార్పిడి లక్ష్యంగా తన యాత్ర ఫర్ చేంజ్ సాగుతోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. 19 రోజులుగా సాగుతున్న తన యాత్రలో ప్రజలు అనేక సమస్యలు తన దృష్టికి తెస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీకి స్థానం లేదని.. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో హాత్ సే హాత్ జోడో యాత్ర కొనసాగుతోంది. మల్లాపూర్‭లో ఉన్న రేవంత్ రెడ్డి.. అక్కడి స్థానికులు, చిరువ్యాపారులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. 

చిరు వ్యాపారులు తమకు బ్యాంకు నుంచి రావాల్సిన రుణాలు రావడం లేదని రేవంత్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా సంఘాలకు ఇవ్వాల్సిన రుణాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. తమ బిడ్డలను పీజీ చదివించినా ఇంతవరకు ఉద్యోగాలు రాలేదని కొందరు రేవంత్ వద్ద వాపోయారు. ఈసారి మహిళా శక్తిని చాటి ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయని ఆయన హామీ ఇచ్చారు.