వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లా ధారూర్ మండలకేంద్రంలో ఓ యువకుడు ప్రతీకార హత్యకు పాల్పడ్డాడు. రాంపూర్ తాండాకు చెందిన మోహన్, శంకర్ ఇండ్లు పక్కపక్కనే ఉన్నాయి. ఆరు నెలల క్రితం కోడి విషయంలో ఇరువురి మధ్య గొడవ జరిగింది. దీంతో శంకర్ కుటుంబ సభ్యులు మోహన్‌ను కొట్టడంతో ఆయన మృతిచెందాడు.
ఈ ఘటనలో శంకర్, అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదైంది. అనంతరం బెయిల్‌పై వచ్చి తాండూర్ మండలం అంతారంలో ఉంటున్నారు. ఈ ఘటనపై మోహన్ కొడుకు సాయికుమార్ కక్ష పెంచుకున్నాడు. బుధవారం వృద్ధాప్య పింఛన్ డబ్బుల కోసం ధారూర్‌కు వచ్చిన శంకర్(63)ను బస్టాండ్ వద్ద వెనుక నుంచి వచ్చి కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. సమాచారం అందుకున్న డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, సీఐ రఘురామ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
