భూ భారతి చట్టంతో రైతులకు మేలు

భూ భారతి చట్టంతో రైతులకు మేలు

వర్ధన్నపేట/ నర్సింహులపేట (దంతాలపల్లి)/ పరకాల/ స్టేషన్​ఘన్​పూర్/ రేగొండ, వెలుగు: భూభారతి చట్టంతో రైతులకు ఎంతో మేలు కలుగుతుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు అన్నారు. భూభారతి అమలులో భాగంగా సోమవారం వరంగల్​జిల్లా వర్ధన్నపేట మండలం బండవుతాపురం, కొత్తపల్లి గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో కలెక్టర్​ సత్యశారదతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. రెండు గ్రామాల్లో కలిపి 149 దరఖాస్తులు వచ్చాయని వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నామని ఎమ్మార్వో విజయసాగర్​ తెలిపారు. మహబూబాబాద్​ జిల్లా దంతాలపల్లి మండలం పెద్ద ముప్పారం, ఆగపేట, రామవరం మేఘతండా, దుబ్బతండా గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సును కలెక్టర్​ అద్వైత్​ కుమార్​ సింగ్​ సందర్శించారు.

ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. కాగా, పెద్దముప్పారంలో 116, అగపేటలో 13 దరఖాస్తులు వచ్చాయని ఆర్డీవో గణేశ్, తహసీల్దార్​ సునీల్​రెడ్డి తెలిపారు.​ హనుమకొండ జిల్లా నడికూడ మండలం ధర్మారంలో నిర్వహించిన 53, చౌటుపర్తిలో 51 దరఖాస్తులు వచ్చాయని తహసీల్దార్​ నాగరాజు తెలిపారు.  జనగామ జిల్లా స్టేషన్​ఘన్​పూర్​మండలం కొత్తపల్లి, విశ్వనాథపురం గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సును కలెక్టర్​ రిజ్వాన్​ బాషా షేక్​ అడిషనల్​ కలెక్టర్​ రోహిత్​ సింగ్​తో కలిసి సందర్శించారు. జయశంకర్ ​భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం లింగాల, కొటంచ గ్రామాల్లో నిర్వహించిన సదస్సును ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు. రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.