
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్పరిధిలో భూగర్భ జలాలు ఇంకిపోకుండా జనం జాగ్రత్తలు తీసుకుంటున్నారని, ఈ వేసవిలో నీటి ఎద్దడి తలెత్తిన ప్రాంతాల్లో భారీగా ఇంకుడు గుంతలు తవ్వుతున్నారని వాటర్బోర్డు ఉన్నతాధికారులు తెలిపారు. వాటర్ ట్యాంకర్ల డిమాండ్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఇంకుడు గుంతల నిర్మాణం కోసం వాటర్బోర్డు చేపట్టిన సర్వే కొనసాగుతోంది. గురువారం వాటర్బోర్డు హెడ్డాఫీసులో రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్ కుమార్ సర్వేపై సమీక్షించారు.
వేసవిలో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో దాదాపు 30 వేల కుటుంబాలు అధికంగా వాటర్ ట్యాంకర్లు బుక్ చేసుకున్నాయని చెప్పారు. ఆయా ప్రాంతాల్లో మరోసారి నీటి ఎద్దడి తలెత్తకుండా ఉండాలని 18 స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఇంకుడు గుంతల సర్వే చేపట్టామని తెలిపారు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఇప్పటికే 4,736 కుటుంబాలకు అవగాహన కల్పించాయని, 2,884 కుటుంబాలు ఇంకుడు గుంతలు నిర్మించుకున్నాయని వెల్లడించారు. 296 కుటుంబాలు గతంలో నిర్మించుకున్న ఇంకుడు గుంతలకు రిపేర్లు చేసుకున్నాయని వివరించారు. 1,852 కుటుంబాలు నిర్మించుకోవాల్సి ఉందన్నారు.
20 శాతానికి పడిపోయిన ట్యాంకర్ల బుకింగ్స్
సిటీలో వాతావరణం పూర్తిగా చల్లబడడంతో నీటి వినియోగం భారీగా తగ్గింది. ప్రస్తుతం రోజుకు ఒక్కో డివిజన్ నుంచి 50 నుంచి 75 ట్యాంకర్లకు మించి బుకింగ్ కావట్లేదని, సమ్మర్తో పోల్చుకుంటే ట్యాంకర్ల బుకింగ్20 శాతానికి పడిపోయిందని అధికారులు వెల్లడించారు. బుక్ చేసిన 24 గంటల్లో నీటిని అందిస్తున్నామని తెలిపారు. పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరుగుతున్నట్టు గుర్తించారు.
ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో ఓఆర్ఆర్ పరిధిలోని చాలా గ్రామాల్లో భూగర్భ జలాలు పెరుగుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో 6 వేలకుపైగానే ఇంకుడు గుంతల నిర్మాణం జరిగిందన్నారు. ఫలితంగా ఓఆర్ఆర్ పరిసర గ్రామాలు, ఐటీ కారిడార్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్వంటి ప్రాంతాల్లోనూ భూగర్భ జలాలు ఆశించిన స్థాయిలో పెరుగుతున్నట్టు తమ పరిశీలనలో తేలిందని మెట్రోవాటర్బోర్డు అధికారులు వెల్లడించారు.